తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. పదేళ్లపాటు తిరుగులేని శక్తిగా వెలిగిన బీఆర్ఎస్ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడమే అతిపెద్ద సవాలుగా మార్చుకుంది. ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన చర్చ ఏమిటంటే బీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీని బీజేపీ క్రమంగా తనలో విలీనం చేసుకుంటోందా? లేదా కేసీఆర్ కుటుంబమే తన మనుగడ కోసం కమలం గూటికి చేరబోతోందా? అనే.
ఓట్ల బదిలీ – బీజేపీకి లాభం, బీఆర్ఎస్కు శూన్యం
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పతనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి. రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోవడమే కాకుండా, కనీసం 15 శాతానికి పైగా ఓట్లను ఆ పార్టీ కోల్పోయింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్‌ను అడ్డుకోవాలనే వ్యూహంతో బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును పరోక్షంగా బీజేపీకి బదిలీ చేసింది. దీనివల్ల బీజేపీ ఎంపీల సంఖ్య పెరిగింది కానీ, బీఆర్ఎస్ మాత్రం జీరో దగ్గరే ఆగిపోయింది. ఈ పరిణామం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీకి అప్పనంగా అప్పగించినట్లయింది.
హరీష్ రావు – బీఆర్ఎస్ రాఘవ్ చద్దా ?
ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చద్దా ఎలాగైతే వ్యూహకర్తగా ఉంటూనే పార్టీని ఇరకాటంలో పడేసే పరిస్థితులు ఎదుర్కొన్నారో, ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి కూడా అలాగే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో నంబర్ 2గా ఉంటూ, ట్రబుల్ షూటర్‌గా పేరున్న ఆయన, ఇప్పుడు పార్టీని కాపాడలేకపోతున్నారనే వాదన బలంగా ఉంది. తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనలు, బీజేపీ అగ్రనేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నారనే ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే గందరగోళం సృష్టిస్తోంది. ఇది పార్టీ లోపల చీలికకు దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
కేసీఆర్ కుటుంబ వ్యూహాత్మక రాజకీయమే టీఆర్ఎస్?
బీజేపీతో విలీనం కాక తప్పదన్న నిర్ణయానికి రావడంతో.. కవితతో ఆ కుటుంబం వ్యూహాత్మకంగా మరో ప్రాంతీయ పార్టీ అదీ కూడా టీఆర్ఎస్ తో పెట్టించారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. బీజేపీలో విలీనం అయితే.. తెలంగాణలో రెండే పార్టీలు అవికూడా జాతీయ పార్టీలు ఉంటాయి. ఖచ్చితంగా ఓ ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతీయ పార్టీ తమ కుటుంబానికి చెందినదే అయి ఉండాలని ఇలా ప్లాన్ చేశారన్న గుసగుసలు కూడా ఢిల్లీ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.
పొత్తు, విలీనం లేకపోతే బీజేపీ మార్క్ రాజకీయం ఖాయం!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి నామమాత్రంగా మారి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యే అసలైన పోరు సాగే అవకాశం ఉంది. ప్రాంతీయ అస్తిత్వాన్ని పణంగా పెట్టి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టిందని చెప్పక తప్పదు. బీజేపీ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ఖాళీని భర్తీ చేస్తూ, ఆ పార్టీ అగ్రనేతలను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అవుతోంది. ఫలితంగా, తెలంగాణలో గులాబీ జెండా రెపరెపలు క్రమంగా కమలం కాంతిలో కరిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే బీఆర్ఎస్ పార్టీ ..బీజేపీ నెక్ట్స్ బాధిత పార్టీగా అంచనా వేస్తున్నారు.
