ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల చిరకాల ఆకాంక్ష, ఉత్తరాంధ్ర ప్రజల నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది.దేశంలోనే 18వ రైల్వే జోన్‌గా ఆవిర్భవించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా అధికారికంగా తన ఉనికిలోకి వచ్చింది. కేంద్ర రైల్వే శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం నూతన జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది నగరంలోని వీఎంఆర్డీఏ ది డెక్ తాత్కాలిక భవనం నుండి విధుల్లో చేరారు.శాశ్వత ప్రాతిపదికన ముడసర్లోవ వద్ద రూ.183 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక 12 అంతస్తుల క్రూజ్ షిప్ నమూనా ప్రధాన కార్యాలయ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి.
భారీ నెట్వర్క్.. పెరగనున్న ఆదాయం:
నూతనంగా ఏర్పాటైన ఈ జోన్ పరిధిలోకి పూర్వపు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు, పునర్వ్యవస్థీకరించిన వాల్తేరు డివిజన్ చేరాయి. ఈ జోన్ మొత్తం 3,532 రూట్ కిలోమీటర్ల మేర రైలు నెట్‌వర్క్‌ను, 385 రైల్వే స్టేషన్లను కలిగి ఉండనుంది. దాదాపు 62,000 మంది ఉద్యోగుల శ్రమశక్తితో నడవనున్న ఈ జోన్ ద్వారా ప్రతిటా సుమారు 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరగడమే కాకుండా, దాదాపు రూ.15,500 కోట్ల వార్షిక ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ జోన్ పరిధి ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉంది.
సరిహద్దులు దాటిన ఆకాంక్ష – లాజిస్టిక్ హబ్‌గా ఏపీ
ఇన్నాళ్లూ వాణిజ్యపరమైన , రవాణా సంబంధిత కీలక నిర్ణయాల కోసం పొరుగు రాష్ట్రాల జోనల్ హెడ్ క్వార్టర్లపై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితులన్నీ తొలగిపోయి విశాఖపట్నమే రైల్వే పరిపాలనకు కేంద్ర బిందువుగా మారింది.ఈ జోన్ ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని సుదీర్ఘ తీరప్రాంతం, వ్యూహాత్మక ఓడరేవులు నేరుగా రైల్వే లైన్లతో మరింత పటిష్టంగా అనుసంధానం కానున్నాయి. ఇది సరుకు రవాణాను వేగవంతం చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్ గా మార్చడానికి దోహదపడుతుంది. దీని ద్వారా పారిశ్రామికాభివృద్ధి ఊపందుకోవడమే కాకుండా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
కొత్త రైళ్లు.. మౌలిక వసతుల వెల్లువ
సొంత జోన్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ పరిధిలో రైల్వే మౌలిక వసతుల కల్పన ఊహించని రీతిలో వేగవంతం కానుంది. కొత్త రైళ్ల మంజూరు, ప్లాట్‌ఫారాల విస్తరణ, స్టేషన్ల ఆధునీకరణ వంటి పనులు జోనల్ స్థాయిలోనే త్వరితగతిన ఆమోదం పొందుతాయి. ముఖ్యంగా తూర్పు కోస్తా కారిడార్‌ను 4-లైన్ల నెట్‌వర్క్‌గా మార్చే పనులు, అదనపు వ్యాగన్ల మరమ్మతు కేంద్రాల సామర్థ్యం పెరగడం వల్ల ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సేవలందుతాయి.ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిన ఈ నిర్ణయం కేవలం రైల్వే రంగానికే పరిమితం కాకుండా, నవ్యాంధ్ర ప్రగతి రథ చక్రాలకు మరింత వేగాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.


