అరెస్టుకు సిద్ధమైన వెళ్లిన కేటీఆర్‌కు.. ఏసీబీ అధికారులు అంత చాన్స్ ఇవ్వలేదు. సాయంత్రం వరకూ విచారణ జరిపి ఇంటికి పంపేశారు. ఆరు గంటల సమయంలో కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఉదయం కేటీఆర్ ఏసీబీ ఆఫీసుకు వెళ్లేటప్పుడు తనను అరెస్టు చేస్తారన్నట్లుగా మాట్లాడారు. ఒక సారికాదు వంద సార్లు అరెస్టు అవుతామన్నారు.
కేటీఆర్‌ను అరెస్టు చేస్తే.. పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడానికి కార్యకర్తల్ని కూడా హైదరాబాద్ పిలిపించారన్న ప్రచారం జరిగింది. తెలంగాణ భవన్ వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ ఆ చుట్టుపక్కల ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. టీస్టాళ్లు, హోటళ్లలో ఉండే వారిని పంపేశారు. అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదంతా కేటీఆర్ అరెస్టుకు సన్నాహాలేనని అనుకున్నారు. కానీ ఏసీబీ అధికారులు మాత్రం అలాంటి చాన్స్ తీసుకోలేదు. కేటీఆర్ పదే పదే కావాలని అరెస్టు అయి సానుభూతి తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. కేబినెట్ సమావేశానికి ముందు సీతక్క ఇదే విషయం చెప్పారు. జైలుకు పోవాలనే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ అరెస్టు లేకపోవడంతో బీఆర్ఎస్ కూడా ఊపిరి పీల్చుకుంది.