బ్ర‌హ్మ‌ణిని కూడా ప్ర‌చారం కోసం పిలిచారు, కానీ..!

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో గెలిచి తీరాల‌న్న పంతంలో తెలుగుదేశం ఉంది. అందుకే, స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు, పార్టీ నేత‌లు నంద్యాల‌పై శ్ర‌ద్ధ పెట్టారు. నంద్యాలలో ప్ర‌చార భార‌మంతా మంత్రి అఖిల ప్రియ భుజాన వేసుకున్నా, ఆమెకి అండ‌గా నిలుస్తూ పార్టీ వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వ‌చ్చి ప్ర‌చారం చేసి వెళ్లారు. మ‌రోసారి ఈ ఇద్ద‌రూ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే, నంద్యాల బ‌రిలో పోరాటం రోజురోజుకీ ఉత్కంఠంగా మారుతున్న నేప‌థ్యంలో పార్టీకి లాభించేలా క‌నిపించే ఏ ఒక్క చిన్న అవ‌కాశాన్ని కూడా జార విడ‌వ‌కూడ‌ద‌నే ప‌ట్టుద‌ల‌తో మంత్రి అఖిల ప్రియ ఉన్నారు. అందుకే, ముఖ్య‌మంత్రి కోడ‌లు, మంత్రి నారా లోకేష్ స‌తీమ‌ణి, న‌టుడు బాల‌కృష్ణ కుమార్తె అయిన నారా బ్ర‌హ్మ‌ణితో నంద్యాల‌లో ప్ర‌చారం చేయించాల‌ని అఖిల ప్రియ భావించిన‌ట్టు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

ఈ ప్ర‌తిపాద‌న‌ను ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రికి అఖిల ప్రియ తెలిపిన‌ట్టు స‌మాచారం. నారా బ్ర‌హ్మ‌ణిని ప్ర‌చారానికి పంపించాల‌నీ, దీంతో పార్టీకి చాలా ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని వివరించార‌ట‌. ముఖ్యంగా మ‌హిళ‌ల్లో ఉత్సాహం పెరుగుతుంద‌నీ, సెంటిమెంట్ కు కూడా కొంత బ‌లం వ‌స్తుంద‌ని సీఎంకు తెలిపిన‌ట్టు చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి కోడ‌లిగా కాక‌పోయినా త‌న స్నేహితురాలిగానైనా ఒక‌సారి ప్ర‌చారానికి వ‌స్తే బాగుంటుంద‌ని ఆమె కోరిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే, ముఖ్య‌మంత్రి ఆలోచ‌న మ‌రోలా ఉంద‌ని స‌మాచారం! ఈ ప్ర‌తిపాద‌న‌ను సీఎం సున్నితంగా తోసిపుచ్చార‌ని టీడీపీ వ‌ర్గాలే అంటున్నాయి. ఈ ఉప ఎన్నిక‌ల్లో బ్ర‌హ్మ‌ణి ప్ర‌చారానికి దిగితే కొన్ని త‌ప్పుడు సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్లే అవ‌కాశాలున్నాయంటూ అఖిల ప్రియ‌కు న‌చ్చ‌జెప్పార‌ని అంటున్నారు. అయితే, ఏదో ఒక‌లా ఒప్పించి, ఆమెను ప్ర‌చారంలోకి తీసుకొస్తే బాగుంటుంద‌నే అఖిల ప్రియ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

నిజానికి, బ్ర‌హ్మ‌ణి రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు అడ‌పాద‌డ‌పా ప్ర‌చారంలోకి వ‌స్తూనే ఉన్నాయి. ఆమె పొలిటిక‌ల్ ఎంట్రీ ఖాయం అన్న‌ట్టుగా టీడీపీలో కూడా ఒక అభిప్రాయం ఉంది. దానికి ద‌గ్గ‌ట్టుగానే వివిధ అంశాల‌పై నారా బ్రహ్మ‌ణి కూడా స్పందిస్తూ, మీడియా ముందు మాట్లాడుతూ ఉంటారు. అయితే, నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆమెని ప్ర‌చారంలోకి దించితే ఆమె ప్ర‌త్య‌క్షంగా రంగంలోకి దిగిన‌ట్టే అవుతుంది. ఒక గ్రాండ్ ఎంట్రీతో ఆమెని రాజ‌కీయాల్లోకి తీసుకుని రావాల‌ని ముఖ్య‌మంత్రి అనుకుంటారుగానీ… ఒక ఉప ఎన్నిక‌లో, అందులో ప్ర‌త్యేక ప‌రిస్థితుల మ‌ధ్య నంద్యాల‌లో జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌లో పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారంలోకి బ్ర‌హ్మ‌ణిని ఎందుకు తీసుకొస్తారు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.