ద‌ర్శ‌కుడితో డామేజీ ఎవ‌రికి??

‘కుమారి 21 ఎఫ్‌’తో సుకుమార్ కాస్త రిస్క్ తీసుకొన్నాడ‌నే చెప్పాలి. ఎందుకంటే ఓ ప‌క్క ‘నాన్న‌కు ప్రేమ‌తో’ సినిమా జ‌రుగుతోంది. ఈ చిన్న సినిమాకి క‌థ‌, స్క్రీన్ ప్లే అందించి, నిర్మాణంలోనూ పాలుపంచుకొన్నాడు. కుమారి ఫేట్ ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ ఎంతో కొంత ఎన్టీఆర్ సినిమాపై ప్ర‌భావం చూపించేదే. అయితే… ఆసినిమా వచ్చి సూప‌ర్ హిట్ కొట్టింది. దాంతో – నిర్మాత‌గానూ సుకుమార్ పాస్ అయిపోయాడు. ఎన్టీఆర్ సినిమాకి ఎలాంటి రిస్క్ లేకుండా పోయింది. సుకుమార్ నుంచి ‘ద‌ర్శ‌కుడు’ అనే మ‌రో సినిమా వ‌స్తోందంటే ఎవ‌రూ ఆపేక్షించలేదు. క‌చ్చితంగా గొప్ప ఐడియా అయ్యుంటుంది, త‌ప్పకుండా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది అనుకొన్నారంతా.

తీరా చూస్తే… సినిమా బెడిసికొట్టింది. రొటీన్ క‌థ‌, రొటీన్ స్క్రీన్ ప్లేతో విసుగు తెప్పించాడు ‘ద‌ర్శ‌కుడు’. ఈ సినిమా క‌థ‌కీ సుకుమార్‌కీ ఎలాంటి సంబంధం లేదు. జ‌స్ట్ నిర్మాత‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రించాడు. కానీ… ఈ సినిమా ఎఫెక్ట్ మాత్రం అంద‌రికంటే సుక్కుపైనే ఎక్కుడ ప‌డే అవ‌కాశం ఉంది. ఎందుకంటే… ఈ సినిమాకి ప్ర‌మోష‌న్ పెరిగిందంటే, హైప్ వ‌చ్చిందంటే అదంతా సుక్కుని చూసే. పెద్ద హీరోలు ప్ర‌మోష‌న్ చేయ‌డానికి ముందుకొచ్చారంటే అదంతా సుకుమార్ ఎఫెక్టే. టికెట్ తెగేది కూడా ‘సుకుమార్ రైటింగ్స్‌’ అనే బ్యాన‌ర్ చూసే. అలాంట‌ప్పుడు క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో సుకుమార్ జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది. లేదంటే రిజ‌ల్ట్ తెలిసిపోయిన‌ప్పుడైనా లైట్ తీసుకోవాల్సింది.

‘ఇది నా సినిమా’ అనేలా ప్ర‌మోట్ చేశాడు సుకుమార్‌. కాబ‌ట్టి ఈ ఫ్లాప్‌కీ తానే బాధ్య‌త తీసుకోవాల్సివ‌స్తోంది. ఇక మీద‌ట ‘సుకుమార్ రైటింగ్స్‌’ బ్యాన‌ర్‌లో ఓ సినిమా వస్తే.. గుడ్డిగా వెళ్లిపోవ‌డానికి ప్రేక్ష‌కుడు ఎవ‌రూ సిద్ధంగా ఉండ‌రేమో..! మ‌రి ఈ ఫ్లాప్ ఎఫెక్ట్‌.. రామ్ చ‌ర‌ణ్ ‘రంగ‌స్థ‌లం’పై ప‌డుతుందా?? ఆ సినిమా సంక్రాంతికి విడుద‌ల కాబ‌ట్టి – అప్ప‌టి వ‌ర‌కూ ఈ చేదు జ్ఞాప‌కం మ‌ర్చిపోయే ఛాన్సుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.