ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ పాలసీపై చర్చ జరగాలని చంద్రబాబు కోరుతున్నారు. అయితే చాలా మంది రాజకీయంగా, వ్యక్తిగతంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు కుటుంబంలో ఒక్కర్నే కంటున్నారని ముందు వారి కుటుంబంలో ఎక్కువ మంది కనాలని కొంత మంది వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొంత మంది ఆయన ఇచ్చే పాతిక వేలతో మూడో బిడ్డను సాకగలమా అంటున్నారు. కానీ అసలు సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు.
పాపులేషన్ పాలసీ రాజకీయం కాదు !
ఒకప్పుడు జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడానికి ఇద్దరు ముద్దు, ఆపై వద్దు అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాల పాటు విస్తృతంగా ప్రచారం చేశాయి. ఆ విధానం విజయవంతమై, జనాభా నియంత్రణ సాధ్యపడింది. కానీ, కాలక్రమంలో ఆ నాణేనికి ఉన్న రెండో కోణం ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తోంది. సంతానోత్పత్తి రేటు స్థిరంగా పడిపోతుండటం, భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగి పనిచేసే యువత శాతం పాతాళానికి పడిపోతుండటం రాష్ట్రాన్నే కాదు, మొత్తం దేశాన్ని కూడా భయపెడుతున్న కొత్త సవాలు. ఐరోపా, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే ఈ సమస్యతో సతమతమవుతున్నాయి.
పిల్లల్ని పెంచడం ఆషామాషీ కాదు..అందుకే చర్చ జరగాలి !
మూడో బిడ్డను కంటే ప్రభుత్వం ఇచ్చే రూ.25,000 ప్రోత్సాహకం ఏ మూలకు సరిపోతుంది? అని సామాన్యులు అడుగుతున్న ప్రశ్నలో నూటికి నూరు శాతం వాస్తవం ఉంది. ఆధునిక కాలంలో పిల్లల పెంపకం, విద్య, వైద్య ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే, ఈ వాస్తవాన్ని కేవలం ప్రభుత్వాన్ని నిలదీసే రాజకీయ అస్త్రంగా వాడకూడదు. జనాభాను ప్రోత్సహించాలంటే పౌరుల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం ఎలా తగ్గించాలి? నాణ్యమైన ఉచిత విద్య, మెరుగైన వైద్యం ఎలా అందించాలి? అనే నిర్మాణాత్మక చర్చకు ఇది పునాది కావాలి.
పెను సవాల్‌గా మారిన ఫెర్టిలిటీ సమస్యలు
నేటి యువతరం ఎదుర్కొంటున్న ఆరోగ్య, జీవనశైలి సమస్యలు ఈ పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. నేటి కాలంలో పిల్లలను కనకపోవడం అనేది కేవలం దంపతుల వ్యక్తిగత ఇష్టం మాత్రమే కాదు, అదొక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. గల్లీకో ఫెర్టిలిటీ సెంటర్ పుట్టుకురావడం, సంతాన ప్రాప్తి కోసం ఏదైనా ఆలయంలో పూజలు జరుగుతాయంటే వేలాది మంది దంపతులు అక్కడికి బారులు తీరడం.. సమాజంలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో కళ్లకు కడుతోంది. ఇలాంటి సున్నితమైన, శారీరక, మానసిక సవాళ్లపై సమాజంలో విస్తృతమైన అవగాహన, లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఐదేళ్ల రాజకీయం కాదు !
జనాభా విధానం అనేది ఒక పార్టీకో, ఒక ప్రభుత్వానికో సంబంధించిన ఐదేళ్ల రాజకీయ వ్యవహారం కాదు. ఇది ఒక జాతి మనుగడకు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది భవిష్యత్ తరాల సమతుల్యత కోసమేనని, దీనిని రాజకీయ కోణంలో చూడకూడదని అర్థం చేసుకోవాలి. రాజకీయ పక్షాలు, మేధావులు, సామాన్య ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి ఒక ఆరోగ్యకరమైన, ఆలోచనాత్మకమైన చర్చకు సిద్ధపడితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. లేకపోతే పాలకులైనా, ప్రజలైనా.. కాలం దాటిపోయాక ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోవాల్సి వస్తుంది.