తెలంగాణ అసెంబ్లీలో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇప్పసారా ను సమర్థిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కావని, దీని వెనుక ప్రభుత్వ పెద్దల వ్యూహాత్మక మౌనం దాగి ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆయన బయట కూడా జోరుగా ఇప్పసారాను ప్రమోట్ చేస్తున్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో, కొత్త ఆదాయ వనరుల కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే, నిషేధిత సారా ను ఒక బ్రాండెడ్ ఆర్గానిక్ డ్రింక్ గా మార్చి మార్కెట్లోకి తెచ్చే ప్రతిపాదనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడానికి అనిరుధ్ రెడ్డిని ఒక టెస్ట్ కేస్ గా వాడుకుంటున్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ప్రజాభిప్రాయ సేకరణ – ఒక వ్యూహం
ప్రస్తుతం అనిరుధ్ రెడ్డి చేస్తున్న ప్రచారం ఒక టెస్ట్ బెలూన్ లాంటిది. ఇప్పసారా ఆరోగ్యానికి మేలు చేస్తుందని, గిరిజనులకు లక్షల కోట్ల ఆదాయం తెస్తుందని ఆయన పదేపదే చెబుతున్నారు. ఒకవేళ ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకపోతే, దీన్ని తెలంగాణ టెకిలా పేరుతో ప్రభుత్వమే అధికారికంగా మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉంది. తద్వారా వేల కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కార్ భావిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ , మహిళా సంఘాల నుంచి వస్తున్న వ్యతిరేకతను కూడా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.
వ్యతిరేకత వస్తే ఎమ్మెల్యే పైత్యం .. సక్సెస్ అయితే సర్కార్ పథకం
ఒకవేళ ఈ ఇప్పసారా అంశంపై ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమైతే, ప్రభుత్వం చాలా తెలివిగా తప్పుకోవడానికి మార్గం సిద్ధం చేసుకుంది. అది కేవలం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యక్తిగత పైత్యం అని, పార్టీకి లేదా ప్రభుత్వానికి దాంతో సంబంధం లేదని తేల్చి చెప్పే వెసులుబాటు ఉంది. అందుకే ఆయన ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా, హైకమాండ్ మాత్రం ఆయనను వారించడం లేదు. పైగా అసెంబ్లీ వేదికగా మంత్రులు కూడా ఈ అంశంపై అధ్యయనం చేస్తామని చెప్పడం చూస్తుంటే, లోపల ఏదో పెద్ద ప్లాన్ నడుస్తోందని అర్థమవుతోంది.
ఆర్థిక సంక్షోభమే అసలు కారణమా?
రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండటం, సంక్షేమ పథకాలకు నిధుల సర్దుబాటు కష్టంగా మారడంతో.. మద్యం ఆదాయాన్ని పెంచుకోవడమే ఏకైక మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది. సాధారణ మద్యం కంటే తక్కువ ధరకే ప్యూర్ ఇప్పసారా అందుబాటులోకి తెస్తే, బెల్టు షాపుల అవసరం తగ్గుతుందని, అదే సమయంలో ప్రభుత్వానికి గ్యారెంటీ ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి అనిరుధ్ రెడ్డి చేస్తున్న ఈ హడావుడి వెనుక, ప్రభుత్వం ఇప్పసారాను మళ్లీ రాష్ట్రంలో చట్టబద్ధం చేసే దిశగా వేస్తున్న తొలి అడుగులు కనిపిస్తున్నాయని గట్టి నమ్మకం బలపడుతోంది.
