“నిజమైన ప్రతిపక్షం ప్రభుత్వానికి శత్రువు కాదు, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే ఒక జాగృత శక్తి ”
ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు జరగడం, మెజారిటీ వచ్చిన వారు పాలించడం మాత్రమే కాదు. అధికార పక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినప్పుడు కళ్ళెం వేసే ప్రతిపక్షం ఉండటం ఆ వ్యవస్థకు ప్రాణవాయువు వంటిది. కానీ, నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షం అంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అనే సంకుచిత అర్థానికి పరిమితమైపోయింది. క్షేత్రస్థాయిలో పోరాటాల కంటే, సోషల్ మీడియా వేదికగా సాగే ట్రోలింగ్ రాజకీయాలే జ్యమేలుతున్నాయి.
ఒకప్పుడు ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించే వ్యవస్థ. అసెంబ్లీలో తార్కికమైన చర్చలు, బయట ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటాలు ఉండేవి. ఒక జీవో విడుదల చేయాలంటే ప్రభుత్వం పదిసార్లు ఆలోచించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిపక్షాలు తాము అధికారంలో లేమన్న విషయాన్ని జీర్ణించుకోలేక, ప్రజల కోసం పోరాడటం కంటే తమ ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. అధికార పక్షంపై వ్యతిరేకత పెంచితే చాలు, తదుపరి అధికారం తమకే దక్కుతుందనే ఒక రకమైన నెగటివ్ పాలిటిక్స్ భ్రమలో ప్రతిపక్షాలు ఉండిపోతున్నాయి. అభివృద్ధిలో లోపాలను ఎత్తిచూపడం కంటే, వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాల ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే ఏకైక అజెండాగా మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఏపీలో తాము ప్రతిపక్షమే కాదనుకుంటున్న వైఎస్ఆర్సీపీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రశ్నిస్తోంది. గత ఎన్నికల్లో సుమారు 40 శాతం ఓటు బ్యాంకును, కోటి మందికి పైగా ప్రజల మద్దతును పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేవలం ప్రతిపక్ష హోదా అనే సాంకేతిక కారణాన్ని సాకుగా చూపి సభకు దూరం కావడం ఆ ఓటర్లను వంచించడమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో సంఖ్య కంటే గొంతుక ముఖ్యం. పది మంది ఎమ్మెల్యేలు ఉన్నా, వారు సభలో తార్కికంగా మాట్లాడితే ప్రభుత్వం దిగిరాక తప్పదు. కానీ, వైసీపీ నాయకత్వం కేవలం తమపై వస్తున్న కేసుల నుండి రక్షణ పొందడానికో లేదా తమ సొంత రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికో పరిమితమవుతోంది. తమ ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను సమీక్షించుకుని ప్రజల వద్దకు వెళ్లాల్సింది పోయి, అధికార పక్షం మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అనే విక్టిమ్ కార్డ్ వేసుకోవడం వల్ల ప్రజల్లో సానుభూతి కంటే అసహనమే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీ చేస్తున్న పోరాటాలన్నీ ఎక్కువగా కేసుల చుట్టూ, పార్టీ నేతల రక్షణ చుట్టూనే తిరుగుతున్నాయి. సూపర్ సిక్స్ హామీల అమలు , ప్రభుత్వ వైఫల్యాల మీద నిర్మాణాత్మక విమర్శలు చేయడం కంటే, సోషల్ మీడియాలో బురద చల్లడం పైనే ఆ పార్టీ యంత్రాంగం ఎక్కువ దృష్టి పెడుతోంది. రాజకీయం అంటే అధికారం కోసం చేసే ఆరాటం మాత్రమే కాదు, అధికారం లేనప్పుడు ప్రజల కోసం చేసే పోరాటం అన్న సూత్రాన్ని విస్మరించి, కేవలం డిజిటల్ వేదికలకే పరిమితం కావడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ నీరసించిపోతోంది. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల చర్చా వేదిక, అక్కడ గొంతు వినిపించకపోతే ప్రతిపక్షంగా తన ఉనికిని కోల్పోయినట్టే అవుతుంది.
మరోవైపు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో బేషరతుగా మద్దతు ఇస్తూ, రాష్ట్రంలో అదే పార్టీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వంపై పోరాడుతున్నామని చెప్పడం ప్రజల్లో తీవ్ర అయోమయానికి దారితీస్తోంది. ఈ ద్వంద్వ వైఖరి పరోక్షంగా అధికార పక్షానికే సహకరించడమే అవుతుంది. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా సాగుతున్న ఈ రాజకీయం ఆ పార్టీ విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. నాయకుడి బలం గెలిచినప్పుడు కాదు, ఓడిపోయినప్పుడు ఎలా నిలబడ్డాడు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. వైసీపీ సాంకేతిక సాకులను పక్కన పెట్టి, ప్రజా సమస్యలనే అజెండాగా మార్చుకుని అసెంబ్లీకి వెళ్లాలి.
ప్రజల పట్ల కనీస బాధ్యత లేని నేతగా మారిన జగన్ రెడ్డి
ఇక ఐదు సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డగోలుగా అనుభవించిన జగన్ .. ఇప్పుడు పూర్తిగా ప్రజలను మర్చిపోయారు. వారానికి రెండు రోజులు బెంగళూరు నుంచి రాష్ట్రానికి రావడం, ముందస్తుగా సిద్ధం చేసిన స్క్రిప్టును ప్రెస్ మీట్లలో చదివి వినిపించడం తప్ప ఆయన చేస్తుందేమీ లేదు. ఇప్పటికే ఆ పార్టీ అనుకూల పత్రికల్లో వస్తున్న కథనాలనే మళ్లీ గొంతు విప్పి చెప్పడం వల్ల కొత్తగా ప్రజల్లోకి వెళ్లే సందేశం ఏమీ లేదు. పైగా, ఆయన పర్యటనలు ప్రజా సమస్యల పరిష్కారం కంటే ఆర్భాటపు ఊరేగింపులకే పరిమితమవుతున్నాయి. ఈ క్రమంలో తలెత్తుతున్న భద్రతా లోపాలు సామాన్య కార్యకర్తల ప్రాణాల మీదకువస్తున్నాయి. ప్రజల పక్షాన పోరాడటం అంటే కేవలం కెమెరాల ముందు మాట్లాడటం కాదు, వారి కష్టాల్లో తోడుగా నిలబడటమని వైసీపీ నాయకత్వం గుర్తించలేకపోతోంది.
మరోవైపు, అధికార పక్షాన్ని విమర్శించే క్రమంలో వైసీపీ అనుసరిస్తున్న తీరు అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరపాల్సింది పోయి, ముఖ్యమంత్రిని, మంత్రులను , వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం అప్రజాస్వామికం. ఇటువంటి చర్యలు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించడమే కాకుండా, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే వ్యూహాన్ని బయటపెడుతున్నాయి. విమర్శలు విధానాల మీద ఉండాలి కానీ, వ్యక్తుల మీద కాదు అనే కనీస రాజకీయ ధర్మాన్ని విస్మరించి, బూతు పురాణాలతో రాజకీయ కలుషితం చేయడం వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతోంది. దీన్ని వైసీపీ గుర్తించడం లేదు.
తామింకా ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని అంగీకరిస్తున్న బీఆర్ఎస్
తెలంగాణ రాజకీయ యవనికపై ఒకప్పుడు సింహగర్జన చేసిన గులాబీ దళం, నేడు ప్రతిపక్ష పాత్రను పోషించడంలో పూర్తిగా వెనుకబడిపోయింది. మేము ఇంకా సమర్థవంతమైన ప్రతిపక్షంగా అవతరించలేదు అని ఆ పార్టీ కీలక నేత జగదీష్ రెడ్డి స్వయంగా అంగీకరించడం వారి దైన్యస్థితికి అద్దం పడుతోంది. పదేళ్ల పాటు పరిపాలించిన అనుభవం ఉన్న పార్టీ, ప్రజా సమస్యలపై పదునైన బాణాలను సంధించాల్సింది పోయి, ఇంకా బాధ్యతారాహిత్యంతో కాలం గడుపుతోంది. ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది కేవలం ఫామ్ హౌస్‌లకే పరిమితం కావడానికి కాదు, అసెంబ్లీలో ప్రజా గొంతుకగా నిలవడానికి అని ఇప్పటికీ గుర్తించలేకపోతున్నరాు. బీఆర్ఎస్ ప్రస్తుతం అనుసరిస్తున్న తీరు క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడం కంటే, సోషల్ మీడియా వేదికగా అబద్ధాలను వందసార్లు ప్రచారం చేసి నిజం చేయాలనే వ్యూహంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని ఆశించడం రాజకీయాల్లో సహజమే, కానీ ఆ వ్యతిరేకతను తమ వైపు తిప్పుకునే విశ్వసనీయత ను వారు కోల్పోతున్నారు. గత పదేళ్ల తమ పాలనలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో, నేడు వారు చేస్తున్న విమర్శలే బూమరాంగ్ లా మారి వారికే తగులుతున్నాయి. కార్యకర్తలను రోడ్ల మీదకు నడిపించి ప్రజా పోరాటాలు చేయాల్సింది పోయి, కేవలం ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించడం వల్ల పార్టీ క్యాడర్ కు సరైన దిశానిర్దేశం లేకుండా పోయింది. నాయకత్వం లేని సైన్యంలా గులాబీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాజ్యాధికారం శాశ్వతం కాదు, కానీ ప్రజా పక్షాన నిలబడటం నిరంతర ప్రక్రియ. బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికైనా తన అహంకారాన్ని వీడి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మారాల్సిన అవసరం ఉందన్న భావన వ్యక్తమవుతోందటే వారింకా తెలుసుకోలేదనే అర్థం. కేవలం సోషల్ మీడియాలో బురద చల్లడం వల్ల అధికారం తిరిగి రాదు. క్షేత్రస్థాయిలో ప్రజల విశ్వాసాన్ని మళ్ళీ పొందాలంటే వాస్తవాలతో పోరాడాలి. ప్రజల తీర్పును గౌరవించి, సభలోనూ, బయటా బాధ్యతాయుతమైన పాత్ర పోషించకపోతే… ప్రజలిచ్చిన బాధ్యతను సరిగ్గా నెరవేర్చనట్లే.
అధికారం కోసం చేసే పోరాటాలుగా మారుతున్న పార్టీల తీరు
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ పరిణామాలు కేవలం అధికారం కోసం సాగే పోరాటాలుగా మాత్రమే మిగిలిపోవడం ప్రజాస్వామ్యవాదులను తీవ్రంగా కలచివేస్తోంది. ఒకప్పుడు ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి ఒక దిక్సూచిలా, హెచ్చరికలా ఉండేది. కానీ నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ పరిస్థితి తలకిందులైంది. ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజల కష్టాలను భుజానికెత్తుకోవాల్సిన పార్టీలు, కేవలం సోషల్ మీడియా వేదికగా సాగే ‘డిజిటల్ యుద్ధాల’కే పరిమితం కావడం వల్ల క్షేత్రస్థాయిలో ఒక రకమైన రాజకీయ శూన్యత ఏర్పడింది. గణాంకాలను పరిశీలిస్తే, గత కొన్ని ఎన్నికల కాలంగా సోషల్ మీడియా పై రాజకీయ పార్టీలు పెడుతున్న ఖర్చు వందల కోట్లకు చేరింది. కానీ, అదే సమయంలో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై జరిగే చర్చా సమయం మాత్రం దారుణంగా పడిపోయింది. గతంలో బడ్జెట్ సమావేశాలు నెల రోజుల పాటు సాగి, ప్రతి పద్దుపై లోతైన చర్చ జరిగేది. కానీ ఇప్పుడు అవి కేవలం వారం పది రోజుల్లోనే ముగిసిపోతున్నాయి. ప్రతిపక్షాలు హాజరు కాకపోవడం, వాకౌట్లు చేయడం, అసెంబ్లీని బహిష్కరించడం వల్ల విలువైన సమయం వృధా అవుతోంది, దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగంపై ఉండాల్సిన పర్యవేక్షణ పూర్తిగా సడలిపోతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. పదేళ్ల పాటు తిరుగులేని అధికారాన్ని అనుభవించిన ఆ పార్టీ, ఓటమి తర్వాత అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని ప్రచారం చేయడం మినహా, ఆ వ్యతిరేకతను తమ వైపు తిప్పుకునే నిర్మాణాత్మక కార్యక్రమాలు ఏవీ చేపట్టడం లేదు. తెలంగాణలో రైతు రుణమాఫీ, ఉపాధి హామీ లేదా సాగునీటి ప్రాజెక్టుల వంటి కీలక అంశాలపై ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ విఫలమవుతోంది. ఆ పార్టీ నేత జగదీష్ రెడ్డి అన్నట్లు, వారు ప్రతిపక్ష పాత్రను స్వీకరించడానికి సిద్ధంగా లేరనేది అక్షర సత్యం. కేవలం ఐటీ హబ్‌లలో కూర్చుని సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రభుత్వంపై బురద చల్లడం వల్ల తాత్కాలికంగా కొంత హడావిడి సృష్టించవచ్చు కానీ, గ్రామీణ స్థాయి ఓటర్ల మనసు గెలవడం అసాధ్యం. తెలంగాణ ఉద్యమ సమయంలో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన అదే పార్టీ, నేడు కేవలం డిజిటల్ స్క్రీన్లకే పరిమితం కావడం వారి రాజకీయ పతనానికి సంకేతంగా కనిపిస్తోంది.
హిట్ అండ్ రన్ రాజకీయాలకు అలవాటు పడ్డ ప్రతిపక్ష పార్టీలు
అసలైన విషాదం ఏమిటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు హిట్ అండ్ రన్ రాజకీయాలకు అలవాటు పడ్డాయి. ఏదో ఒక ఆరోపణ చేయడం, దానికి సోషల్ మీడియాలో రెక్కలు తొడగడం, ఆ తర్వాత దానిపై వచ్చే నిజనిజాలను పట్టించుకోకుండా మరో కొత్త ఆరోపణకు వెళ్లడం ఒక నిరంతర ప్రక్రియగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయని రోజంటూ లేదు. కానీ ఒక్క ఆరోపణలపైనా స్థిరంగా నిలబడి కొట్లాడలేకపోతున్నారు. ఏపీలో అయితే చెప్పాల్సిన పని లేదు. అసలు ఆరోపణలే విపక్షంపై వస్తూంటాయి. సోషల్ మీడియాలో వచ్చే 80 శాతం రాజకీయ పోస్టులు పెయిడ్ వర్కర్లు, బాట్స్ ద్వారా సృష్టిస్తున్నారు. అంటే ప్రజల నిజమైన నాడికి, సోషల్ మీడియాలో కనిపిస్తున్న ట్రెండ్లకు మధ్య సంబంధం తెగిపోయింది. అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమవుతుందనే భ్రమలో ఉన్న పార్టీలు, ప్రజలు తమ విచక్షణతో నిజాన్ని గ్రహిస్తారనే విషయాన్ని మర్చిపోతున్నాయి. అసత్య ప్రచారాల వల్ల ప్రభుత్వాలకు వచ్చే నష్టం కంటే, ఆ ప్రచారం చేసే పార్టీల విశ్వసనీయతకే ఎక్కువ ముప్పు వాటిల్లుతోంది. ప్రజల పక్షాన నిలబడి పోరాడే నాయకత్వం లేకపోతే, పాలక పక్షం నిరంకుశంగా మారే అవకాశం ఉంటుంది.
రాజకీయ శూన్యత కంటే ప్రతిపక్ష శూన్యత
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజకీయ శూన్యత కంటే ప్రతిపక్ష శూన్యత ఎక్కువగా కనిపిస్తోంది. సమర్థమైన ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం నియంతృత్వ ధోరణితో వ్యవహరించే ప్రమాదం ఉంది. రాజకీయాలు అంటే కేవలం అధికార మార్పిడి కోసం చేసే కుతంత్రాలు కాకూడదు. అవి ప్రజా సేవ కోసం చేసే యజ్ఞం కావాలి. అప్పుడే తెలుగు రాష్ట్రాల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు కావాల్సింది కేవలం విమర్శించే ప్రతిపక్షం కాదు, పరిష్కారాలను చూపే ప్రతిపక్షం. ప్రభుత్వం చేసే ప్రతి పనిని వ్యతిరేకించడం కాకుండా, అభివృద్ధి పనుల్లో లోపాలను వేలెత్తి చూపిస్తూ, దానికి మెరుగైన ప్రత్యామ్నాయాలను సూచించగలిగే మేధోశక్తి ప్రతిపక్షాలకు ఉండాలి. అసెంబ్లీని గౌరవించడం, సభా మర్యాదలను పాటించడం, ప్రజా సమస్యలపై లోతైన అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే ప్రతిపక్షాలు ప్రజల మద్దతును తిరిగి పొందగలవు. రాజకీయం అంటే కేవలం ఎన్నికల మేనేజ్మెంట్ కాదు, అది ప్రజల జీవితాలను మార్చే ఒక గొప్ప సాధనం. ఈ నిజాన్ని గుర్తించి ప్రతిపక్షాలు తమ వైఖరిని మార్చుకోకపోతే, భవిష్యత్తులో వారు ప్రజల నుండి మరింత దూరం కావడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సమర్థవంతమైన ప్రతిపక్షం లేని రాష్ట్రం దిక్సూచి లేని నావ లాంటిది, కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాలు తమ అస్తిత్వ పోరాటాన్ని పక్కన పెట్టి ప్రజా హితం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే.. ఓటములకు కారణాలు చెప్పుకోవడానికి అలవాటు పడాల్సిందే.
