ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గరకు వచ్చింది. మార్చి నెలాఖరులోనే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేశాయి. ఏప్రిల్లో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగుస్తుండటంతో, గడువులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది.
ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. మార్చి 9వ తేదీ నాటికి అన్ని గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు , పంచాయతీ రాజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా విభజన చేపట్టి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది.
పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు ఇచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో గ్రామాల్లో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అధికారులు తుది నివేదికలను సిద్ధం చేస్తున్నారు. మార్చి చివరి వారంలో పోలింగ్ నిర్వహించి, ఏప్రిల్ మొదటి వారంలోగా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయితే పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన లేకుండా కొత్త సర్పంచులు కొలువుదీరనున్నారు.
