భారత్‌లో నెంబర్ వన్ సెఫాలజి కంపెనీ యాక్సిస్ మై ఇండియా. ఎన్నికల ఫలితాలను శాస్త్రీయంగా అంచనా వేయడంలో దిట్టగా పేరు పొందారు. ఈ సంస్థ అధినేత ప్రదీప్ గుప్తా భారత రాజకీయాలపై సంచలన అంచనాలను వెలువరించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అప్రతిహత ఆధిపత్యం కనీసం 2034 వరకు కొనసాగే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఎలాగైతే దశాబ్దాల పాటు దేశాన్ని ఏకపక్షంగా పాలించిందో, ఇప్పుడు బీజేపీ విషయంలోనూ అదే వన్ పార్టీ డామినెన్స్ పునరావృతమవుతోందని చెబుతున్నారు.
2034 వరకు బీజేపీదే హవా
ప్రదీప్ గుప్తా తన అంచనాకు ప్రధానంగా రాజకీయ తరాల మార్పు అనే లాజిక్‌ను తెరపైకి తెచ్చారు. సాధారణంగా ఒక రాజకీయ తరం ప్రభావం సుమారు 20 ఏళ్ల పాటు ఉంటుందని, 1977 వరకు కాంగ్రెస్ ఎలాగైతే అప్రతిహతంగా పాలించిందో, 2014లో మొదలైన బీజేపీ ప్రభంజనం కనీసం 20 ఏళ్ల పాటు అంటే 2034 వరకు కొనసాగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బీజేపీ ఒక కేంద్ర బిందువుగా మారిందని, దానిని ఢీకొట్టే స్థాయికి విపక్షాలు చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుందని ఆయన విశ్లేషించారు.
పనితీరే గెలుపు గుర్రం
బీజేపీ విజయ పరంపరకు కేవలం భావోద్వేగాలే కారణం కాదని, ఆ పార్టీ అందిస్తున్న గుడ్ గవర్నెన్స్ ప్రధాన కారణమని ప్రదీప్ గుప్తా చెబుతున్నారు. ఓటర్లు ఇప్పుడు చాలా పరిణతి చెందారని, కేవలం ఉచిత పథకాలు లేదా మతపరమైన అంశాలకు లొంగిపోకుండా, పనితీరు ఆధారంగానే ఓటు వేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ , ఎన్డీయే కూటమి తమ ప్రస్తుత పనితీరును గరిష్ట స్థాయిలో కొనసాగించినంత కాలం వారికి ఎదురుండదని, ఒకవేళ పాలనలో తీవ్రమైన వైఫల్యాలు ఎదురైతే తప్ప అధికారం చేజారదని ఆయన స్పష్టం చేశారు.
విపక్షాలకు సవాలు – లెగసీ సమస్యలు
కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి కనీసం మరో ఐదేళ్లు పట్టవచ్చని ఆయన అంచనా వేశారు. గతంలోని పాలనాపరమైన లోపాలు, అవినీతి ఆరోపణలు ప్రజల మనసుల్లో ఇంకా బలంగా ఉన్నాయని, వాటిని చెరిపివేసి దేశవ్యాప్తంగా ప్రజల నమ్మకాన్ని గెలవడానికి కాంగ్రెస్‌కు 2029 తర్వాతే అవకాశం ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు బీజేపీకి ఎదురులేదని, అయితే భారీ మెజారిటీ వచ్చినప్పుడు ప్రజల అంచనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని, ఆ అంచనాలను అందుకోవడం బీజేపీకి ఉన్న అసలైన సవాలని ఆయన హెచ్చరించారు.
రాజకీయ పరిణతి – తమిళనాడు ఉదాహరణ
ఇటీవలి ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ర్టీకి వచ్చిన ఆదరణను గుర్తు చేస్తూ.. ఓటర్లు మార్పును కోరుకుంటున్నారని, అయితే అది నమ్మశక్యమైన ప్రత్యామ్నాయం ఉన్నప్పుడే సాధ్యమవుతుందని గుప్తా వివరించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి అటువంటి గట్టి ప్రత్యామ్నాయం ఇంకా సిద్ధం కాలేదని, అందుకే 2034 వరకు బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు.
