రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూన్ 21 నుండి జూలై 19 మధ్య కాలంలో పదవీకాలం ముగియనున్న ఎంపీల స్థానాలకు జూన్ 18న పోలింగ్ జరగనుంది ఈ విడతలో మొత్తం 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ఒక్కో రాష్ట్రంలో 4 స్థానాలు , మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో చెరో3 స్థానాలు, జార్ఖండ్‌లో 2 స్థానాలు, *మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగుతాయి.
బీజేపీకి లాభం – కాంగ్రెస్‌కు నష్టం
రిటైర్ అవుతున్న 24 మంది సభ్యుల్లో సుమారు 12 మంది బీజేపీకి చెందిన వారు ఉండగా, కాంగ్రెస్ నుండి మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్ వంటి హేమాహేమీలు పదవీ విరమణ చేస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీల్లో ఉన్న బలాబలాల ప్రకారం.. బీజేపీ తాను కోల్పోయే స్థానాల కంటే ఎక్కువ స్థానాలనే గెలుచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గుజరాత్ లోని 4 స్థానాలనూ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోనుంది. ఏపీలో కూడా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది.
టూ-థర్డ్ మెజార్టీ సాధ్యమేనా?
ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం 113గా ఉంది.ఎన్డీయే బలం సుమారు 148 . రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా, మూడింట రెండొంతుల మెజార్టీ సాధించాలంటే 164 సీట్లు అవసరం. ఈ జూన్ ఎన్నికల తర్వాత బీజేపీ తన స్వంత బలాన్ని 120 కి పెంచుకునే అవకాశం ఉంది. ఎన్డీయే కూటమి బలం 160 కి చేరుకోవచ్చు. అంటే, ఈ ఎన్నికల తర్వాత కూటమితో కలిసి 2/3 మెజార్టీని అందుకోవడానికి ఇంకా కొద్దిగా దూరం ఉంటుంది. అయితే కూటమిలో లేకపోయినా బీజేపీకే మద్దతు పలికే వైసీపీ లాంటి పార్టీలతో రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించినట్లే.
అప్రతిహత అధికారం దిశగా..
నవంబర్ 2026లో ఉత్తరప్రదేశ్ లో మరికొన్ని ఖాళీలు రానున్నాయి. ఈ జూన్ , నవంబర్ ఎన్నికల ఫలితాలు కలిపితే, 2026 చివరి నాటికి బీజేపీ రాజ్యసభలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. తద్వారా లోక్‌సభతో పాటు రాజ్యసభలోనూ ఏ బిల్లునైనా అడ్డులేకుండా ఆమోదించుకునే సూపర్ పవర్ బీజేపీకి లభించనుంది. ఇది దేశ రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలకవచ్చు.
