తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వర్సెస్ ఫార్మా సిటీ యుద్ధం మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముచ్చర్ల ప్రాంతంలో దాదాపు 16,000 ఎకరాల్లో ఫార్మా సిటీ ని ప్రతిపాదించగా, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిని ఫ్యూచర్ సిటీ గా మార్చి ఒక మెగా స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు , తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ ని రద్దు చేసి మళ్లీ ఫార్మా సిటీ నే తీసుకువస్తామని ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రియల్ ఎస్టేట్ వర్సెస్ ఇండస్ట్రీ
హరీష్ రావు ప్రధాన ఆరోపణ ఏంటంటే.. రేవంత్ సర్కార్ ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని. ఫార్మా సిటీ ద్వారా లక్షలాది మంది యువతకు పారిశ్రామిక ఉద్యోగాలు వస్తాయని, కానీ ఫ్యూచర్ సిటీ వల్ల కేవలం భూముల ధరలు పెరిగి రియల్టర్లకు మాత్రమే లాభం చేకూరుతుందని ఆయన వాదిస్తున్నారు. కేంద్రం కేవలం ఫార్మా సిటీ కి మాత్రమే పర్యావరణ అనుమతులు ఇచ్చిందని, ప్రాజెక్ట్ ఉద్దేశం మారిస్తే చట్ట ప్రకారం ఆ భూములను రైతులకే తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీని ద్వారా బీఆర్ఎస్ అటు నిరుద్యోగులను, ఇటు భూములు కోల్పోయిన రైతులను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది.
రేవంత్ రెడ్డి విజన్ 2034
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జూన్ 2, 2026న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సైబరాబాద్‌ను తలదన్నేలా ఏఐ , హెల్త్ సిటీ, నెట్ జీరో ఎమిషన్స్‌తో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరాన్ని నిర్మిస్తామని ఆయన చెబుతున్నారు. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ వంటివి ఇక్కడ రావడం రేవంత్ మార్క్ ఫ్యూచర్ సిటీ కి బలాన్నిస్తోంది. ఫార్మా సిటీ వల్ల కాలుష్యం పెరుగుతుందనే భయంతో ఉన్న స్థానిక ప్రజల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ప్రజల్లో స్పందన ఎలా ఉంటుంది?
రాజకీయంగా ఇదొక జూదం లాంటిది. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాబోయే రెండేళ్లలో అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో ఐటీ కంపెనీలను లేదా మౌలిక సదుపాయాలను నిర్మిస్తే, అది ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుంది. అప్పుడు బీఆర్ఎస్ రద్దు’ చేస్తామనే ప్రకటన అభివృద్ధికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. కానీ, కేవలం లేఅవుట్లకే అది పరిమితమైతే.. హరీష్ రావు వాదనకు బలం చేకూరుతుంది. ముఖ్యంగా ఉపాధి కోసం ఎదురుచూసే యువతకు ఫార్మా సిటీ వైపు మొగ్గు ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే అది మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో భారీ ఉద్యోగాలను ఇస్తుంది.
గతంలో అమరావతి విషయంలో జరిగినట్టే, పాలకులు మారినప్పుడల్లా భారీ ప్రాజెక్టుల పేర్లు, ఉద్దేశాలు మారిపోతుంటే పెట్టుబడిదారుల్లో అపనమ్మకం కలిగే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ రద్దు ప్రకటన ద్వారా ప్రస్తుత ఫ్యూచర్ సిటీపై పెట్టుబడులు పెట్టేవారిని వెనక్కి తగ్గేలా చేసే వ్యూహంతో ఉందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.