టీటీడీ ఈవో నియామ‌కంపై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ద‌క్షిణాది రాష్ట్రాల ఆత్మ‌గౌర‌వం అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా మ‌రోసారి ట్విట్ట‌ర్ లో స్పందించారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవోగా ఉత్త‌రాదికి చెందిన అధికారి నియామ‌కాన్ని ప‌వ‌న్ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఆ ప్రాంతంలో ద‌క్షిణాదికి చెందిన ఒక్క అధికారైనా ఉన్నారా అంటూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఇలాంటి ప‌రిస్థితిని మ‌నం ఎందుకు భ‌రించాల్సి వ‌స్తోంద‌న్నారు. ఉత్త‌రాది ఐ.ఎ.ఎస్‌. అధికారి నియామ‌కాన్ని తాను త‌ప్ప‌బ‌డ‌ట్టం లేద‌నీ, మ‌న నియామ‌క ప్ర‌క్రియ తీరుపై తాను స్పందిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం, గౌర‌వ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని ప‌వ‌న్ అన్నారు. వార‌ణాసి, మ‌ధుర‌, అమ‌ర్‌నాథ్ వంటి క్షేత్రాల్లో ద‌క్షిణాదికి చెందిన ఉన్న‌తాధికారుల‌ను నియ‌మించిన చ‌రిత్ర లేద‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ నియామకం విష‌యంలో ద‌క్షిణాది ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం జ‌వాబు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌వ‌న్ ఘాటుగా ట్వీట్ చేశారు.

అయితే, టీటీడీ ఈవో విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇలా స్పందించ‌డం వెన‌క బ‌ల‌మైన ఒత్తిడే ప‌నిచేసింద‌ని తెలుస్తోంది. ఏపీ స‌ర్కారు ఉత్త‌రాది కి చెందిన అధికారిని నియ‌మించ‌డం అన్ని వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ త‌రువాత రోజు నుంచీ కొంత‌మంది ఉన్న‌తాధికారులు వ‌రుస‌గా ప‌వ‌న్ ను క‌లుసుకున్నారని స‌మాచారం. టీటీడీలో అత్యున్న‌త ప‌ద‌వుల్ని ఆశిస్తున్న‌వారు… చంద్ర‌బాబు నిర్ణ‌యంతో కాస్త హ‌ర్ట్ అయిన‌వారు వీరిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ దృష్టికి వారే తీసుకెళ్లిన‌ట్టు చెబుతున్నారు. ద‌క్షిణ భార‌తదేశానికి చెందిన అధికారుల‌ను ప్ర‌భుత్వం ఎందుకు గుర్తించ‌డం లేద‌ని ప‌వ‌న్ ద‌గ్గ‌ర వాపోయార‌ట‌. ఉత్త‌రాది అధికారుల‌ను మ‌నం నెత్తిన పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని కూడా వీరు ప్ర‌స్థావించార‌ట‌.

సో.. అవే అంశాల‌ను ప‌వ‌న్ దృష్టిలో పెట్టుకుని తాజా ట్వీట్ చేసిన‌ట్టు చెప్పొచ్చు. అయితే, దీనిపై ఇంకా ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు. టీటీడీ వ‌ర్గాలు కూడా దీనిపై ఇంకా ఎలాంటి కామెంట్స్ చెయ్య‌లేదు. మొత్తానికి, తాజాగా ప‌వన్ చేసిన వ్యాఖ్య‌లు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. భాజ‌పా స‌ర్కారు నిర్ణ‌యాలు ఉత్త‌రాదికి అనుకూలంగా ఉంటున్నాయ‌నీ, ద‌క్షిణాదిపై సీత‌క‌న్నేస్తున్నార‌నీ ప‌వ‌న్ చాలాసార్లు విమ‌ర్శించారు. అయితే, వాటిపై భాజ‌పా ‘నో కామెంట్స్’ అని మ్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే అంశంపై చంద్ర‌బాబుని ప‌వ‌న్ టార్గెట్ చేసుకోవ‌డం విశేషం. మ‌రి, ఈ విష‌యంలో టీడీపీ స‌ర్కారు ఎలాంటి స‌మ‌ర్థ‌న ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com