జగన్, బాబు, మోడీ, రాహుల్ కాదు….కేజ్రీవాల్‌ ఒక్కడే లంచగొండి

వహ్వా……మోడీ రాజకీయాన్ని ఎవరైనా మెచ్చుకుని తీరాల్సిందే. వ్యవస్థలన్నింటినీ ఈ స్థాయిలో మేనేజ్ చేయడం ఇందిరాగాంధీకి కూడా సాధ్యం కాలేదు. ఇందిరాగాంధీ తీసుకున్న చాలా నిర్ణయాలపై అప్పట్లో తీవ్రస్థాయి వ్యతిరేకత వచ్చింది. అప్పట్లో ఇందిరతో యుద్ధం ప్రకటించిన స్థాయిలో పోరాడిన నేతలున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని స్తంభాలు మోడీకి జైకొడుతున్నాయి. విమర్శించే ధైర్యం, మోడీతో పోరాటానికి తెగించే నాయకుల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది. మోడీని వ్యతిరేకిస్తే శశికళ గతే అని చాలా స్పష్టంగా సందేశం ఇస్తున్నారాయే. అది కూడా తీర్పులన్నీ కూడా అప్పటికప్పుడు వచ్చేస్తాయి. మూల విరాట్ జయలలిత దోషి కాకుండా పోతుంది. పరాన్న జీవి శశికళ మాత్రం అవినీతి సామ్రాట్ అయిపోతుంది.

ఇక ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌తో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చని మోడీని పొగిడే అవకాశం ఎప్పుడూ ఎదురు చూస్తూ, బానిస స్థాయిలో భళి భళీ మోడీ అంటూ జపం చేస్తున్న చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినప్పటికీ ఆ కేసు విషయంలో అతీగతీ ఉండదు. సోనియా హయాం నుంచీ ఉన్న జగన్ కేసుల్లో కూడా పురోగతి అస్సలు ఉండదు. బిజెపి-వైకాపాలు పరస్పరం విమర్శలు చేసుకోవడం ఎప్పుడైనా కనిపించిందా? అలా జగన్ కూడా మోడీకి బంధువేనన్నమాట. ఇక గాలి జనార్థన్‌రెడ్డిలాంటి వాళ్ళు కూడా కర్ణాటక ఎన్నికల సమయానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మోడీ మనిషిగానే ఉంటాడు కాబట్టి ఆయన కూడా పతిత్తు అయిపోతాడు. మోడీ, రాహుల్‌, సోనియాలతో సహా ఈ దేశంలో ఉన్న బడా బడా నేతలు ఓ కార్పోరేట్ సంస్థ నుంచి ఏ స్థాయిలో ముడుపులు తీసుకున్నారో ఈ మధ్యనే సాక్ష్యాధారాలతో సహా బయటపడింది.

అయినప్పటికీ వాళ్ళందరూ కూడా అవినీతి అంటే ఏంటో తెలియని అమాయక ప్రజలు. కానీ ప్రధానమంత్రిగా కనీవినీ ఎరుగని స్థాయి విజయం సాధించి ఢిల్లీ ఎన్నికల బరిలో తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నంత స్థాయిలో ప్రచారం చేసినప్పటికీ అడ్డంగా మట్టికరిపించిన కేజ్రీవాల్ మాత్రం కచ్చితంగా అవినీతిపరుడే. ఢిల్లీలో కాంగ్రెస్‌ని ఖతం చేశాడు కాబట్టి ఈ విషయంలో రాహుల్‌ది కూడా అదే మాట. మోడీ వారు కలలు కన్న దిశగా భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఉన్న ఒకే ఒక్క అడ్డు కేజ్రీవాల్ ఒక్కడే. ఆ కేజ్రీవాల్‌ని పడగొడితే చాలు….ఇక మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే నాయకుడే ఉండడు. ఇప్పుడంతా కూడా నాయకులకు భజన చేసే మీడియా హవానే కాబట్టి ఆ వైపు నుంచి కూడా సమస్యలు ఉండవు. అందుకే పార్టీని విడిచిపెట్టి వెళ్ళిన వ్యక్తి మాట్లాడిన మాటలకు అంతటి ప్రాధాన్యం మరి. పార్టీ నుంచి బయటికి వెళ్ళిన ఏ నాయకుడైనా అప్పటి వరకూ ఉన్న పార్టీని, ఆ పార్టీ అధినేతను అవినీతి పరుడు అని విమర్శించని సందర్భం ఉందా? మరి ఆ అన్ని సందర్భాల్లోనూ, ఆయా పార్టీలు, ఆ అధినేతలపైనా విచారణ జరగలేదే. ఇలా మాట్లాడితే ఇప్పుడు దొరికిన వాళ్ళకైనా శిక్షలు పడుతున్నాయి కదా అని వాదించే భక్తులు బయల్దేరతారు. శిక్షలు పడుతున్నది అవినీతి వ్యవహారాల గురించి అయితే సంతోషించాల్సిన విషయమే. కానీ మోడీకి భక్తులా? కాదా? అనే విషయం ఆధారంగా శిక్షలు, కేసులు నడుస్తూ ఉన్నాయంటే మాత్రం అంతిమ ఫలితం ఎలా ఉంటుందో సులభంగానే ఊహించుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com