రాష్ట్రంలోని నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేయడమే కాకుండా, ఆ ఆస్తిపై వారికి సర్వహక్కులు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 2016 కంటే ముందు మంజూరైన ఇళ్ల పట్టాల విక్రయానికి అనుమతినిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇది పేదలను ఆనందానికి గురి చేస్తుంది. ఎందుకంటే వారికి జగన్ రెడ్డి చేసిన దౌర్జన్యం గుర్తుకు వస్తుంది. ఏటీఎస్ పేరుతో పది మందిని ఇళ్ల మీదకు పంపి డబ్బులు వసూలు చేసిన దౌర్భాగ్యం గుర్తుకు వస్తుంది.
ఇళ్ల లబ్దిదారులపై ఏటీఎస్ పేరుతో జగన్ సర్కార్ దోపిడీ
గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో పేదల నుంచి నగదు వసూలు చేసేందుకు ప్రయత్నించింది. ఎన్టీఆర్ హయాం నుంచి ఇచ్చిన ఇళ్ల స్థలాలు లబ్దిదారుల లెక్కలు తీసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వెంటపడింది. దానికి వన్ టైం సెటిల్మెంట్ అనే పేరు పెట్టింది. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వంటి వారిని ఇళ్ల మీదకు పంపి వేధించింది. అయితే చాలా మంది పేదలకు కట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి రుసుము లేకుండానే లబ్ధిదారులకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తోంది.
పేదలకు జగన్ మార్క్ నరకం
గత పాలనలో ఓటీఎస్ పథకం పేరిట లబ్ధిదారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిన ఉదంతాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10 వేల నుంచి పట్టణ ప్రాంతాల్లో రూ. 20 వేల వరకు చెల్లిస్తేనే హక్కులు కల్పిస్తామంటూ అధికారులు ఇంటింటికీ తిరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. పేదలు తమకున్న అరకొర సంపాదనలో ఈ మొత్తం చెల్లించలేక సతమతమయ్యారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అవేమీ లేకుండా, కేవలం పదేళ్ల కాలపరిమితిని ప్రామాణికంగా తీసుకుని, 2016 లోపు పట్టా పొందిన వారందరికీ నేరుగా విక్రయ అధికారాన్ని కట్టబెట్టింది. ఇది నిజమైన సంక్షేమమని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి తమ ఆస్తిపై చట్టబద్ధమైన హక్కులు లభించనున్నాయి.
అందరికీ మేలు !
గతంలో పట్టా ఉన్నప్పటికీ అది కేవలం నివసించడానికి మాత్రమే పరిమితమయ్యేది. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం దాన్ని అమ్ముకోవాలన్నా, బ్యాంకు రుణం పొందాలన్నా నిబంధనలు అడ్డు వచ్చేవి. ఇప్పుడు ఆ భూములను 22ఏ నుండి తొలగించడంతో పాటు, క్రయవిక్రయాలకు మార్గం సుగమం కావడంతో నిరుపేద కుటుంబాలకు ఒక పెద్ద ఆర్థిక భరోసా దక్కింది. జగన్ ప్రభుత్వం డబ్బుల కోసం పేదలను ఇబ్బంది పెడితే, చంద్రబాబు ప్రభుత్వం పేదలకు ఆస్తి హక్కును గిఫ్ట్‌గా ఇచ్చింది. పేదవాడి సొంతింటిని ఆర్థిక వనరుగా మార్చుకునే అవకాశాన్ని కల్పించడం ద్వారా ప్రభుత్వం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా అడుగులు వేసింది.
