గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన సీఐఐ సమ్మిట్‌లో పాల్గొన్నారు. CII నిర్వహించిన బిజినెస్ సమ్మిట్‌లో చంద్రబాబు తన విజన్‌ను పారిశ్రామికవేత్తల ముందుంచారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టేందుకు రూపొందించిన విజన్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ గురించి పారిశ్రామికవేత్తలకు వివరించి, పెట్టుబడులతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా కేంద్ర మంత్రులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. చంద్రబాబు మొదటగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన హామీల అమలు, ఏపీకి రావలసిన నిధుల విడుదలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌ను కలిసి, పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించారు. పోలవరం రెండో దశ నిధుల విడుదలతో పాటు, రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో కూడా ఆయన భేటీ అయ్యి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.
ఈ పర్యటనలో మరో విశేషం ఏమిటంటే.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో చంద్రబాబు జరిపిన చర్చలు. అమరావతి రాజధాని నిర్మాణం మరియు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించే విషయమై ఈ సమావేశంలో సానుకూల స్పందన లభించినట్లు సమాచారం. ప్రభుత్వం గత 23 నెలల్లో చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఏపీలో పెట్టుబడి వాతావరణం మెరుగుపడిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఆయన అస్సాం సీఎం హిమంత ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు.
