అన్నాడీఎంకే మరోసారి చీలిక దిశగా వెళ్తోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం, క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోవడం వంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి పై తిరుగుబాటు జెండా ఎగిరింది. మాజీ మంత్రి ఎస్.పి. వేలుమణి , సి.వి. షణ్ముగం నేతృత్వంలోని అసమ్మతి వర్గం పార్టీని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు సిద్ధమయింది.
వరుస ఓటములతో కుదేలైన అన్నాడీఎంకేను కాపాడుకోవాలంటే ఎడప్పాడి పళనిస్వామి తప్పుకోవాల్సిందేనని వేలుమణి వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. పార్టీ ప్రతిష్ట మసకబారుతోందని, నిర్ణయాలన్నీ ఏకపక్షంగా ఉంటున్నాయని ఆరోపిస్తూ దాదాపు 36 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. వీరంతా సి.వి. షణ్ముగం నివాసంలో సమావేశమై, ఎస్.పి. వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా గుర్తించాలని పట్టుబడుతున్నారు. దీంతో కేవలం 17 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పళనిస్వామి ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయారు.
ఈ సంక్షోభంలో మరో ఆసక్తికర మలుపు ఏమిటంటే, రెబెల్ ఎమ్మెల్యేలు నటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కజగం కి మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అసెంబ్లీలో జరగబోయే విశ్వాస పరీక్షలో విజయ్ పార్టీకి అండగా నిలిచి, ఎడప్పాడిని ఒంటరిని చేయాలన్నది వీరి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇప్పటికే వేలుమణి వర్గం తమకు ఉన్న సంఖ్యాబలంతో అసలైన అన్నాడీఎంకే తమదేనని క్లెయిమ్ చేస్తూ అసెంబ్లీ సెక్రటరీకి లేఖలు పంపినట్లు తెలుస్తోంది.
ఇరు వర్గాలు విడివిడిగా లేఖలు అందజేయడంతో, ఇప్పుడు బంతి అసెంబ్లీ స్పీకర్ కోర్టులోకి వెళ్లింది. ఒకప్పుడు పన్నీర్ సెల్వంను పక్కన పెట్టి పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న పళనిస్వామికి, ఇప్పుడు వేలుమణి రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెజారిటీ ఎమ్మెల్యేలు వేలుమణి వెంటే ఉండటంతో అన్నాడీఎంకేలో ఎడప్పాడి శకం ముగిసినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అన్నాడీఎంకే నిలువునా చీలిపోవడమో లేదా వేలుమణి చేతుల్లోకి వెళ్లడమో దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.