తెలంగాణ రాజకీయాల్లో ఏదో సైలెంట్ ఆపరేషన్ జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు పెద్ద ఎత్తున ఒకే సారి బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారన్న గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఆర్మూర్ జీవన్ రెడ్డి, మల్కాజిగిరి మల్లారెడ్డి వంటి వారు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. మరికొంత మంది రహస్యంగా కలుస్తున్నారు. బీఆర్ఎస్లో అంత చురుగ్గా లేకుండా ఉన్న నేతలు గుంభనంగా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో అధికారమే బీజేపీ లక్ష్యం
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. గతంలో మాదిరిగా భారీ బహిరంగ సభలు, ఆర్భాటాలు లేకుండా.. నిశ్శబ్దంగా నియోజకవర్గ స్థాయి కీలక నేతలను ఆకర్షించే పనిలో పడినట్లుగా కనిపిస్తోంది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి వంటి నేతలు ఢిల్లీ పర్యటనలు చేయడం, అక్కడి అధిష్ఠాన పెద్దలతో రహస్యంగా భేటీ కావడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. వచ్చే ఆరు నెలల్లో బీఆర్ఎస్ నుంచి గణనీయమైన స్థాయిలో క్యాడర్ బీజేపీలోకి జంప్ అయ్యేలా ఆ పార్టీ ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
నియోజకవర్గాల్లో నాయకత్వ లోటు పూడ్చడమే లక్ష్యం
బీజేపీకి గత ఎన్నికల్లో మంచి హైప్ వచ్చినా వారికి నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం లేకపోవడం వల్లే విజయాలు రాలేదు. బీజేపీకి రాష్ట్రవ్యాప్తంగా ఓటు బ్యాంకు పెరుగుతున్నప్పటికీ, చాలా నియోజకవర్గాల్లో గెలిచే గుర్రాలు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్. ఈ లోటును పూడ్చుకోవడానికి బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న , భవిష్యత్తు కోసం వెతుకుతున్న బలమైన నేతలపై కమలనాథులు కన్నేశారు. బీఆర్ఎస్ క్యాడర్ను తనలో విలీనం చేసుకోవడం ద్వారా, కాంగ్రెస్కు ఏకైక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నది బీజేపీ మాస్టర్ ప్లాన్.
బీఆర్ఎస్, బీజేపీ పొత్తుల అనుమానాలు
బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తులు ఉండవచ్చని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అదే జరిగితే సగం సీట్లు బీఆర్ఎస్ కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే రాజకీయ మనుగడ కోసం అధికార కాంగ్రెస్లోకి వెళ్లలేని వారు, సహజంగానే బీజేపీని సురక్షితమైన వేదికగా భావిస్తున్నారు. మల్లారెడ్డి వంటి ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేతలు తమ సామ్రాజ్యాలను కాపాడుకోవడానికి, వారసులకు రాజకీయ భవిష్యత్తు కల్పించడానికి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
అంతా ఢిల్లీ స్థాయిలోనే జరుగుతోందా?
ఈ వలసల వెనుక ఢిల్లీలోని బీజేపీ పెద్దల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేవలం సమన్వయకర్తలుగా వ్యవహరిస్తుండగా, చేరికల విషయంలో తుది నిర్ణయం మాత్రం ఢిల్లీలోనే జరుగుతోంది. వచ్చే ఆరు నెలల కాలం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు ఒకవైపు, దాన్ని ఖాళీ చేసి లాభపడాలని మరో వైపు బీజేపీ రాజకీయాలు చేయనున్నాయి.
