ఎమ్మెల్సీ అనంతబాబు వయవహారం దుమారం రేపుతోంది. ఆయన ఏ మాత్రం భయం లేకుండా.. సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన కేసులో సాక్షుల్ని బెదిరించడం..ప్రలోభ పెట్టడం చేశాడంటే .. వ్యవస్థలపై ఆయనకు ఉన్న చిన్న చూపు ఏమిటో అర్థం అయిపోతుంది. ఈయన ఉదంతంపై ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత కూడా స్పందించడం లేదు. కనీసం ఖండించడం లేదు. ఇప్పుడు ఆయన వైసీపీ ఎమ్మెల్సీ. గతంలో సస్పెండ్ చేసినా అతి ఉత్తుత్తిదే.
సస్పెన్షన్ అంటే సెలవు మాత్రమే!
వైసీపీ నిఘంటువులో సస్పెన్షన్ అంటే పార్టీ నుంచి వెలివేయడం కాదు, కేవలం ప్రజల్ని, మీడియాను మోసం చేయడానికి జారీ చేసే ఓ ఆదేశం. అనంతబాబు తన డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడే ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసింది. కానీ, ఆ తర్వాత ఆయన అదే పార్టీ కార్యక్రమాల్లో కనిపించినా, నేతలతో ఫోటోలు దిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే వైసీపీలో సస్పెన్షన్లు అనేవి కేవలం పబ్లిక్ రిలేషన్స్ స్టంట్ మాత్రమే. వైసీపీలో నేర ప్రవృత్తి ఉన్న నేతలకు అక్కడ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కార్డ్ ఉంటుంది.
వ్యవస్థలంటే ఇంత చిన్న చూపా?
హత్య చేసి దొరికిపోయినప్పుడే సాక్షులను బెదిరించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం వంటి అంశాలపై సుప్రీంకోర్టు సైతం రాష్ట్ర పోలీసుల తీరును, అనంతబాబు పరపతిని చూసి విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు-అధికారం మధ్య ఉన్న అపవిత్ర బంధం అని కోర్టు గట్టిగా మొట్టికాయలు వేసినా, వైసీపీ నేతలకు మాత్రం నోరు పెగలడం లేదు. కనీసం ఆయన చేస్తున్న అరాచకాలను ఖండించే ప్రయత్నం చేయడం లేదు. బహుశా, జగన్ అన్నే నా ధైర్యం అని ఆయన నమ్ముతుండబట్టే ఈ పరిస్థితి వచ్చింది.
అనంతబాబు లాంటి వాళ్లకు సపోర్టు చేసి ఏం సాధిస్తారు?
ప్రస్తుతానికి అనంతబాబు అటు కోర్టుల దృష్టిలో నేరస్థుడు, ఇటు పోలీసుల దృష్టిలో పరారీలో ఉన్న వ్యక్తి. కానీ, వైసీపీ శ్రేణుల దృష్టిలో మాత్రం ఆయన ఇప్పటికీ లీడర్ అనంత బాబే . సస్పెన్షన్ ఎత్తేశామని అధికారికంగా చెప్పరు, అలాగని డిస్మిస్ చేశామని పొరపాటున కూడా అనరు. ఇలాంటి డెడ్లీ కాంబినేషన్ కేవలం వైసీపీలోనే సాధ్యం. అధికారంలో ఉన్నప్పుడు అండగా ఉంటాం.. విపక్షంలో ఉన్నప్పుడు వదిలేసినట్లు నటిస్తాం అనే సరికొత్త రాజకీయ సూత్రాన్ని అనంతబాబు కేసులో వైసీపీ పక్కాగా అమలు చేస్తోంది. ఇలాంటి నేతలకు సపోర్టు చేసి వైసీపీ ఏం సాధిస్తుందో మరి!
