సినిమాల్లో అతి ఎక్కువగా ఉంటే అది కామెడీ అయిపోతుంది. హీరోయిజాన్ని అయినా కన్విన్సింగ్ గా చెప్పలేకపోతే అది కామెడీ కూడా కాదు..నవ్వులాట అయిపోతుంది. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ పేరుతో కొంత మంది చేస్తున్న హడావుడి..దానికి కొన్ని మీడియా, సోషల్ మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారం చూస్తే.. ఇలాంటి నవ్వులాటే పరిస్థితే ఏర్పడుతోంది. ఏందీ ఫ్యాన్స్ అని జనం కూడా నొసటితో నవ్వుకుంటున్నారు.
బాలకృష్ణ ఏమన్నారు .. ఎక్కడన్నారో తెలుసా ?
చిరంజీవి ఫ్యాన్స్.. బాలకృష్ణపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలనుకున్నారని.. కానీ చిరంజీవి ఆపేశారని కొన్ని మీడియా చానళ్లలో ప్రచారం అయింది. ఈ మాటల్ని చూసి అందరూ భళ్లుమన్నారు. వారికి కామన్ సెన్స్ లేదని .. అందరికీ అర్థమైపోయింది. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడమేంటి?. అసలు బాలకృష్ణ ఏమన్నారు.. ఎక్కడ మాట్లాడారో కూడా వీరికి తెలియదు. అసెంబ్లీలోపల ఏం జరిగినా.. ఏం మాట్లాడినా బయట కోర్టులకు కూడా జోక్యం చేసుకోవడానికి అధికారం లేదు. ఈ విషయం పక్కన పెడితే బాలకృష్ణ బూతులేం మాట్లాడలేదు. అభ్యంతరకరమైన పదాలేం వాడలేదు. ఆ విషయం వీడియో చూస్తే స్పష్టమవుతుంది. మరి ఎందుకు ఇంత అతి చేస్తున్నారు.
బాలకృష్ణ ఫ్యాన్స్ పేరుతో మరింత అగ్గి !
బాలకృష్ణ మాట్లాడిన మాటలు రికార్డుల నుంచి తొలగించారు. కామినేని మాటలు కూడా తొలగించారు. ఇది అసెంబ్లీలో జరిగిన విషయం. రాజకీయాలకు సంబంధం లేదు. కానీ ఈ వివాదాన్ని పెద్దది చేయడంలో మాత్రం బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా కీలక పాత్ర పోషించారు. ఒకరి తర్వాత ఒకరు సోషల్ మీడియాలో రెచ్చగొట్టి.. గ్రూప్ కాల్స్ అని హడావుడి చేశారు. అసలు ఇది ఫ్యాన్స్ జోక్యం చేసుకోవాల్సిన అంశం కాదు.
వైసీపీ స్పాన్సర్డ్ చిల్లర రాజకీయం జోక్యంతోనే ఇదంతా !
జనసేన సానుభూతిపరుల ముసుగులో కొంత మంది వైసీపీ స్పాన్సర్డ్ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఫ్యాన్స్ అసోసియేషన్లు ఇలాంటి రచ్చ పెట్టుకుంటాయి. వారికి కావాల్సింది వ్యక్తిగత ప్రయోజనాలు. హీరోను అభిమానిగా చెప్పుకుని తమ దందాలు తాము చేయడం. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం. దీని వల్ల వారికి కావాల్సిన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ వారు ఎవరి పేరుతో ఇలాంటివి చేస్తున్నారో వారికి మాత్రం నష్టం వస్తుంది. ఇలాంటి అభిమానుల్ని ప్రోత్సహిస్తే అంతిమంగా నష్టమే. పరువు పోవడమే.