2027 సంక్రాంతికి ఏమేం సినిమాలు వస్తాయి? అనే విషయంలో 10 నెలల ముందే క్లారిటీ వచ్చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సినిమాలు పండగ బరిలో దిగబోతున్నాయి. శర్వానంద్, తేజా సజ్జా కూడా ఈ పండక్కి వస్తారని అనుకొంటున్నారు కానీ, ఈ నలుగురు దిగ్గజాలూ బరిలో దిగితే.. వాళ్లు కాస్త ఆలోచించుకోవాల్సిందే. అయితే.. ఇప్పుడు బాలకృష్ణ ఆలోచన మారిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయిక. బాలయ్యకు ఇది 111వ సినిమా. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుంది. సంక్రాంతి లక్ష్యంగానే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్దామనుకొన్నారు. అయితే ఇప్పుడు ఆ ఆలోచన మారింది. ఈ సినిమాని త్వరిత గతిన పూర్తి చేసి డిసెంబరులో తీసుకురావాలని చూస్తున్నారు. అదే జరిగితే బాలయ్య సినిమాకు సోలో రిలీజ్ దొరుకుతుంది. అఖండ 2 విషయంలోనూ అదే జరిగింది. బాలయ్య డిసెంబరులో సోలోగా వచ్చారు.
అందరి దృష్టీ సంక్రాంతిపైనే ఉంటుంది. డిసెంబరుని ఖాళీగా వదిలేస్తున్నారు. అలాంటప్పుడు ఆ గ్యాప్ ని ఫీల్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పైగా గోపీచంద్ మలినేని సినిమాని చాలా వేగంగా తీస్తారు. నవంబరు నాటికి ఆయన తొలి కాపీ సిద్ధం చేయగలరు. డిసెంబరుని టార్గెట్ చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందనే ఆలోచనలో ఉంది చిత్రబృందం.
