మోదీ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించకపోతే.. వచ్చే ఎన్నికల్లో దించేస్తామని.. రాహుల్ ప్రధాని పదవి చేపట్టి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నాలో ప్రసంగించారు. మోదీ 75 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లో ధర్నా చేస్తే అది .. రాష్ట్ర స్థాయిలోనే ఉంటుందని కానీ ఢిల్లీ స్థాయిలో ధర్నా చేయడం వల్ల దేశం మొత్తం చర్చించుకుంటోందని తెలిపారు. ఈ ప్రసంగంపై మోదీపై రేవంత్ విరుచుకుపడ్డారు. బీసీ బిల్లును ఆపేస్తున్నారని అన్నారు.
తెలంగాణ ప్రజలు గుజరాత్ లో భూములు, ఆస్తులు అడగడం లేదు. బలహీన వర్గాలకు అన్యాయం మోడి చేస్తున్నారు. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు తెలంగాణ బీసీల అవసరం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ధర్నాకు రాలేదో చెప్పాలన్నారు. 2029 ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ చేయలేని పనిని రాహుల్ గాంధీ చేసి చూపిస్తారని ధీమా వ్యక్తం చేసారు. మోడిని గద్దె నుండి దింపుతాం. ఇదే జంతర్ మంతర్ వేదికగా మా శపథం చేస్తున్నామన్నారు. 2029 ఎన్నికలో బిజెపికి 150 కంటే ఒక్క సీటు ఎక్కువగా రావని సవాల్ చేశారు.
అలాగే కేటీఆర్ పైనా మండిపడ్డారు. తమ ధర్నాను కేటీఆర్ డ్రామా అన్నారని.. అసలు డ్రామా కేసీఆర్ కుటుంబంలోనే నడుస్తోందన్నారు. కేటీఆర్ పేరే డ్రామారావని మండిపడ్డారు. బీసీల ఓట్లు అక్కర్లేదు కాబట్టే అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలంతా పాల్గొన్నారు. విజయశాంతి కూడా వచ్చి బీజేపీపై విమర్శలు చేశారు. ఇతర ఇండీ కూటమి మిత్రపక్షాలు కూడా వచ్చి మద్దతు పలికాయి. అయితే రాహుల్ గాంధీ వస్తారని అనుకున్నా.. ఆయన రాలేదు. మద్దతుగా ఓ ట్వీట్ పెట్టారు.