హోదా పై దగా మాత్రమే కాదు అన్ని విధాలా చిన్నచూపే!

చివరి ఆశకూడా పోయింది…ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరగతి హోదా రాదని లెక్కతేలిపోయింది…హోదా కాదు అందుకు బదులుగా డబ్బులిస్తారని ప్రజల మైండ్ సెట్ మార్చే బిజెపి ఎత్తుగడను మీడియాకు లీకులు ఇవ్వడం ద్వారా సుజనా చౌదరి, సిఎం రమేష్ కూలీల మాదిరిగా మోసి అమలు చేశారు. విభజన చట్టం ప్రకారం నిర్మాణం పూర్తి చేయవలసి వున్న పోలవరం ప్రాజెక్టు మీద క్లారిటీ ఇవ్వడం తప్ప కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన కొత్తవిషయమేమీలేదు.

అదే ప్రెస్ మీట్ లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా వుండటాన్ని బట్టి కేంద్రం ప్రకటనకు తెలుగుదేశం ఆమోదం వుందన్న సంకేతం ముందుగానే వెల్లడయింది.

ప్రత్యేకహోదాపై విషయంలేని కేంద్రప్రభుత్వ ప్రకటన పట్ల టివి స్టూడియోల్లో విమర్శలు మొదలయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి మీడియా సమావేశం పెట్టారు. అరుణ్ జైట్లీ చెప్పిన విషయాలనే రాష్ట్ర అవసరాలతో ముడిపెట్టి సాగదీసి వివరించారు.

కేంద్రప్రకటనతో మీరు తృప్తి చెందారా అన్న సూటి ప్రశ్నకు ”నేనేమంటున్నానంటే మన అవసరాలు చాలా వున్నాయి…నిరంతరం కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలి. ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఇబ్బందులు వున్నపుడు హోదా వల్ల వచ్చే ఆర్ధిక ప్రయోజనాలను నెరవేరుస్తామంటున్నారు” అన్నారు.

ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన వైఖరిని రిజర్వ్ చేసుకున్నారు. ఎటుదూకడానికైనా సిద్దంగా గోడమీద కూర్చున్న పిల్లి మాదిరిగా ఆచితూచి మాట్లాడారు…

మొత్తం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకాన్ని ఈ రాష్ట్రంలో వేళ్ళూనుకుంటున్న బిజెపి పూర్తిగా కోల్పోయింది. తనతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా ముంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వెల్లువెత్తిన సిరసన ప్రదర్శనలే అందుకు సాక్ష్యం!

తెలంగాణా ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ, వారి చిరకాల ప్రత్యేక తెలంగాణ సాధన కలను సాకారం చేయడానికి, అన్ని రాజకీయ పక్షాలు నిర్ణయం తీసుకొన్న తరువాత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ అప్పటి ఆంధ్రప్రదేశ్ విభజనను చేపట్టినప్పటికీ – విభజన వల్ల నష్టపోతున్న సీమాంధ్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పలు అంశాలను విభజన బిల్లులో చేర్చామన్నది కాంగ్రెస్ వాదన.

విభజన సమయంలో, ఆ తరువాత ఎన్నికల ముందు సీమాంధ్రకు విభజన చట్టం ద్వారా కల్పిస్తున్న ప్రయోజనాలు చాలవని, కాంగ్రెస్ సీమాంధ్ర కు ద్రోహం చేస్తున్నదని, తాము అధికారంలో రాగానే సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని- ప్రత్యేక హోదాతో సహా మరిన్ని ప్రయోజనాలు సీమాంధ్రకు కల్పిస్తామని పదే పదే ప్రకటించిన – బీజేపీ- తెలుగు దేశం – అధికారంలోకి రాగానే సీమాంధ్ర ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా మరిచి-విభజన చట్టాన్ని, ప్రధాని హామీలను పూర్తిగా గాలికి వదిలేశారు.

అయితే విభజన లో బిజెపి పాత్ర గురించి తెలిసి కూడా-మరో గత్యతరం లేక బీజేపీ-తెలుగుదేశపు కూటమిని సీమాంధ్ర ప్రజలు తలకెత్తుకున్నారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో పాటు, మోడీ-వెంకయ్యనాయుడు-చంద్రబాబు నాయుడులు అన్యాయానికి గురి అయిన సీమాంధ్ర ప్రజల పట్ల చూపిన సానుభూతి, చేసిన వాగ్దానాలు, ప్రకటిచ్చినా వరాలు కూడా కారణమే. అయితే అధికారంలోకి రాగానే – సీమాంధ్ర ప్రయోజనాలను రాష్ట్రం-కేంద్రం మర్చి పోయినాయి.

బీజేపీ జాతీయ పార్టీ కావడం ఎపిలో పట్టు కూడా లేకపోవడం పాటు, ఎపి లో అధికారంలో ఉన్న తెలుగుదేశం మిత్ర పక్ష పార్టీ కావడం తో – బీజేపీకి ఈ రాష్ట్రం మీద ఆసక్తి లేకుండా పోయింది.

కానీ తెలంగాణలో దాదాపు ఉనికి కోల్పోయిన తెలుగుదేశం ఎపి ఆగ్రహానికి గురి అయితే భవిష్యత్ లేదు. కానీ గత రెండు ఏళ్ళు గా తెలుగు దేశం పార్టీ విభజన చట్ట అమలు విషయంలో గాని, హామీల అమలు విషయంలో గాని- సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప – గట్టిగా అడిగింది లేదు. గత ఎన్నికలలో అనూహ్యంగా విజయం సాదించండం తో పాటు, ప్రతిపక్ష నేత అవినీతి కేసులలో నిండా మునగడం, కాంగ్రెస్ పూర్తిగా ఉనికిని కోల్పోవడం తో పాటు – ప్రతిపక్ష శాసన సభ్యులు అధికార పార్టీ ప్రలోభాలలో పడి – అభివృద్ధి పేరుతో అధికార పక్షం లోకి క్యూ కడుతుండడంతో- రెండేళ్లు తెలుగు దేశం ఆడింది ఆట – పాడింది పాట గా తయారయింది.

అంతే కాక, ముఖ్యమంత్రి గారు చూపిన నవ్యఆంధ్ర రాజధాని రంగులకల ను నమ్మి – రాజధాని ప్రాంత రైతులంతా – స్వచ్ఛంద ల్యాండ్ పూలింగ్ కు సహకరించడం – పట్టిసీమతో గోదావరి-కృష్ణా నదుల సంగమాన్ని సాకారం చేయడం – వంటివి తాము సాధించిన విజయాలు అని – దీంతో తాము సీమాంధ్ర ప్రజల హృదయాలలో శాశ్వత సాధించామని – గాల్లో విహరిస్తున్న తెలుగు దేశం శ్రేణులను – ప్రత్యేక హోదా అంశం నేలమీదికి తోసేసింది.

అసలు విభజన చట్టంలో చెప్పిన వాటిలో అసలు కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో ఒకసారి పరిశీలిస్తే – విభజన చట్టంలో చెప్పిన వాటిలో సగం కూడా కేంద్రం అమలు చేయలేదని-రెండేళ్లు గా తెలుగుదేశం ఎపి భవిష్యత్తు గురించి గాని, విభజన చట్ట అమలు గురించి గాని పట్టించుకోకుండా – అధికారంలో మునిగి తేలుతున్నదని అర్ధం అవుతున్నది.

ముఖ్యమంత్రి వాటిపై పట్టు పట్టకుండా సర్దుకు పోవడంతో – ఓటుకు నోటు కేసు ముఖ్యమంత్రి రాజీకి కారణమేమో అని అనుమానం కూడా ప్రజలలో మొదలైంది. ముఖ్యంగా విభజన చట్టంలో -ఈ క్రింది విషయాలలో కేంద్ర వైఖరి – సీమాంధ్రను పలు కష్టాలలో ముంచింది.

 • సెక్షన్ 8 లో చెప్పిన విధంగా- కామన్ కాపిటల్ ఏరియాలో గవర్నర్ ఆధిపత్యం చేపట్టక పోవడంతో-ఓటుకు నోటు కేసు పరిణామాల తరువాత- సీమాంధ్ర ప్రయోజనాలను పణంగా పెట్టి – ఉమ్మడి రాజధానిపై సీమాంధ్రకు గల పది సంవత్సరాల హక్కును వదిలి వేస్తూ- రాజధానిని అర్ధాంతరంగా తాత్కాలిక రాజధానికి తరలించాలనే నిర్ణయం ముఖ్యమంతి తీసుకొన్నారు. దీనివల్ల వెయ్యి కోట్లకు పైగా ఖర్చుతో-తాత్కాలిక సచివాలయ నిర్మాణం తో పాటు – వందల కోట్ల అద్దెలతో – శాఖాధిపతుల కార్యాలయాలు, మంత్రుల అధికారుల నివాసాలు అద్దెకు తీసుకోవలసిన అవసరం వచ్చింది. అంతే కాక – ఆఫీస్ ల తరలింపు కు, ఉద్యోగుల తరలింపుకు ఇంకా కోట్లు వెచ్చించవలసి ఉన్నది. ఈ ఖర్చు ఎప్పటికైనా తప్పదు కానీ విభజన వల్ల వనరుల లేమితో బాధపడుతున్న మొదట్లోనే ఈ ఖర్చు మీద పడడం-ఖచ్చితంగా రాష్ట్రానికి నష్టమే. ఈ అర్ధాంతర తరలింపుకి కారణం – సెక్షన్8 పై కేంద్ర ఉదాసీన వైఖరే.
 • సెక్షన్ 46 లో చెప్పిన విధంగా- సీమాంధ్ర లో ఉన్న వనురులను దృష్టిలో ఉంచుకొని – తగిన గ్రాంట్ లు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి వంటివి, వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి అంటే ముఖ్యంగా రాయలసీమ – ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి – కృషి చేయాలని ఉన్నా- కేంద్రం జిల్లాకు సంవత్సరానికి కేవలం 50 కోట్ల రూపాయలచొప్పున అదికూడా ఐదేళ్ళు మాత్రమే ఇవ్వగలమని చెప్పింది.
 • సెక్షన్ 53, 68, 75 చెప్పిన – షెడ్యూల్ 9 మరియు 10 లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ లు, కంపెనీలు, సంస్థలు – విభజన ఇంకా పూర్తి కాలేదు. వీటి విభజన విషయంలో రెండు రాష్ట్రాలు ఒక సానుకూల అభిప్రాయానికి రాలేక పోతున్నాయి. చాలా వరకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ కార్పొరేషన్ ల ద్వారానే జరుగుతాయి. అయినప్పటికీ, వీటి విభజన పూర్తి కాక పోవడంతో – సచివాలయ/ శాఖాధిపతి కార్యాలయాలను తాత్కాలిక రాజాధానికి తరలించినా- వీటిని హైదరాబాద్‌లోనే కొనసాగించవలసి అవసరం ఎపి ప్రభుత్వానికి ఏర్పడింది. అయినా వీటి విభజన విషయంలో కేంద్ర చొరవ చూకపోవడంతో-వీటి విషయంలో తెలంగాణా ఏక పక్షంగా వ్యవహరిస్తూఉండడంతో- కోర్టులను ఆశ్రయించవలసిన అవసరం ఏర్పడింది.
 • సెక్షన్ 84 నుంచి 89 లలో చెప్పిన విధం గా – నీటి వనురుల విభజన నిర్వహణకు అపెక్స్ కౌన్సిల్ – ఏర్పాటు చేయకపోవడం, ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడంలో చొరవ చూపక పోవడంతో – ఇరు రాష్ట్రాల్లో నీటి వనరుల విషయంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ల ను నీటి విడుదల, విద్యుత్ ఉత్పత్తి విషయంలో – తీవ్ర వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ ఈ విషయంలో ఒక ఇరు రాష్ట్రాల మధ్య ఒక సామరస్య పూర్వక పరిష్కారానికి – కేంద్రం చొరవ చూపడం లేదు. అంతే కాక కృష్ణ, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డులు కూడా-ఆశించిన పని తీరు కనబరచడం లేదు. వీటి విషయంలో ఒక శాశ్వత పరిష్కారానికి కేంద్రం ఏ నిర్మాణాత్మక ప్రయత్నం చేయడం లేదు. అంతే కాక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు – ఈ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ల అనుమతి లేకుండా నిర్మించాలని చూస్తున్న ప్రాజెక్ట్ లపై కూడా – తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
 • సెక్షన్ 94 లో చెప్పిన టాక్స్ ఇన్సెంటివ్స్ విషయంలో – అదనపు డిప్రీసియేషన్ మరియు అదనపు ఇన్వెస్ట్ మెంట్ అలవెన్సు వంటి రెండు మినహాయింపులు తప్ప – పారిశ్రామిక అభివృద్ధికి – ఆర్ధిక అభివృద్ధికి ప్రత్యేకంగా ఇచ్చినవి ఏమీ లేవు. ఎపిలో వివిధ మౌలిక సదుపాయాల కోసం విడుదల చేసిన నిధులు ప్రహరీ గోడలకు కూడా సరిపోవని – తెలుగు దేశం వారే ప్రకటించారంటే – విడుదల చేసిన నిధుల పరిణామాన్ని అర్ధంచేసుకోవచ్చు.
 • సెక్షన్ 95 లో చెప్పిన – ఉన్నత విద్యా సంస్థలలో – ఇరు రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం కోసం – ప్రస్తుతం ఉన్న పరిస్థితులే పది సంవత్సారాలు కల్పించాలని ప్రకటించినప్పటికీ – దీని ఉల్లంఘిస్తూ ఇరు రాష్ట్రాలు – వేరు వేరు ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తూ – విద్యార్థులు రెండు రాష్ట్రాల ఎంట్రన్స్ రాయాల్సిన దుస్థితి కల్పించినా – కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. రెండు రాష్ట్రాలను సెక్షన్ 95 ఇంప్లిమెంట్ చేయాలని – కామన్ అడ్మిషన్ ప్రాసెస్ కొనసాగించాలని కేంద్రం ఒక్క ఆదేశమైనా జారీ చేయలేదు.
 • విభజన చట్టంలోని అంశాలనే పట్టించకోని కేంద్రం, అమలు చేయాలని పట్టుబట్టలేని రాష్ట్రం ప్రజలను ఎలా ఉద్దరిస్తాయో బిజెపి తెలుగుదేశం పార్టీలకే తెలియాలి.

  ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ నోరుతెరిచాక బిజెపి ప్రభుత్వం హడావిడిచేసి చివరికి పోలవరం ప్రాజెక్టు బాధ్యత మాత్రమే తీసుకుంది. అది కూడా చట్టాన్ని అమలు చేయడమే తప్ప ప్రత్యేక పాకేజీకాదు. అదనపు సహాయమూ కాదు.

  విభజన చట్టంలోని పోలవరం ప్రాజెక్టు పై మాత్రమే స్పష్టత ఇవ్వడానికే రెండున్నర ఏళ్ళు వ్యవధితీసుకున్న బిజిపి అన్ని విధాలా ఎపిని ఎలా ఆదుకుంటుందో ఆవిషయాన్ని తెలుగుదేశం ఎలా నమ్ముతుందో ప్రజలకు మాత్రం తీరని అనుమానంగానే మిగిలిపోతుంది.

  Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com