‘ఉప్పెన’తో తొలి అడుగులోనే సూపర్ హిట్టు కొట్టాడు బుచ్చిబాబు. ఆ వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో వర్కవుట్ కాలేదు. కానీ అదే కథని రామ్ చరణ్‌కి చెప్పి ఒప్పించాడు బుచ్చి. అదే… `పెద్ది`. మార్చి27న ఈ సినిమాని తీసుకొద్దామనుకొన్నారు. కానీ ఏప్రిల్ 30కి వాయిదా పడింది. అప్పటికైనా ఈ సినిమా తీసుకొచ్చారంటే అది గ్రేటే. ఎందుకంటే `పెద్ది`కి సంబంధించి చాలా వర్క్ పెండింగ్ లో వుంది. ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తేనే ఏప్రిల్ 30న ఈ సినిమా వస్తుంది. లేదంటే కష్టం. అందుకే బుచ్చిబాబు బిజీ బిజీగా గడుపుతున్నాడు.
పొద్దుటంతా షూటింగ్, రాత్రి ఎడిటింగ్, మళ్లీ ఉదయాన్నే షూటింగ్.. గత కొన్ని రోజులుగా బుచ్చిబాబు దిన చర్య ఇదే. ఆఖరికి తన పుట్టిన రోజున కూడా సెట్లోనే ఉండాల్సివచ్చింది. రెండో యూనిట్ కూడా ఈ సినిమా కోసం వర్క్ చేస్తోందని, రాత్రీ పగలూ తేడా లేకుండా చిత్రబృందం కష్టపడుతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు చెన్నైలో రీ రికార్డింగ్ జరుగుతోంది. ఆ పనులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేషిస్తున్నాడు బుచ్చి.
పెద్ద సినిమా అనేసరికి.. ఇలాంటి టెన్షన్ మామూలే. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొన్న తరవాత.. అది మరింత ఎక్కువ అవుతుంటుంది. ఈ సినిమా అనుకొన్న సమయంలో బయటకు రావాలంటే సుకుమార్ కూడా ఓ చేయి వేయాల్సిందే అంటున్నారు. కాకపోతే సుకుమార్ ఇప్పుడు చరణ్ సినిమా కథలో బిజీగా ఉన్నారు. ఓ వైపు చరణ్ స్క్రిప్టు పనులు చూసుకొంటూనే మరోవైపు బుచ్చిబాబుకి సలహాలు అందిస్తున్నారట. సుకుమార్ టీమ్ కూడా `పెద్ది`కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టిందని, ఈ సినిమాని అనుకొన్న సమయంలో తీసుకురావాలన్నదే అందరి ధ్యేయమని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
