అనుభ‌వంపై ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌కు సీఎం కౌంట‌ర్‌..!

మాట్లాడితే న‌ల‌భ‌య్యేళ్ల రాజ‌కీయానుభ‌వం ఉంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అంటార‌నీ, ఆ అనుభ‌వం ఇసుక మాఫియాకు సొమ్ము దోచి పెట్ట‌డానికి మాత్ర‌మే ప‌నికొచ్చిందిగానీ, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడలేదని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ మ‌ధ్య విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఈ మాట‌పై సీఎం స్పందించారు. క‌ర్నూల్లో జ‌రిగిన న‌వ నిర్మాణ దీక్ష‌లో సీఎం మాట్లాడుతూ, ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్టారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌న్ను గురించి మాట్లాడారు. నా న‌లభ‌య్యేళ్ల అనుభ‌వం ఎక్క‌డిక‌క్క‌డ ఇసుక అమ్ముకోవ‌డానికి ప‌నికొస్తోంద‌ని అన్నారు. ప్ర‌భుత్వానికి ఇసుక మీద రూ. ఐదారు వంద‌ల కోట్ల ఆదాయం వ‌స్తుంద‌ని తెలిసినా, పేద‌వారి కోసం దాన్ని వ‌దులుకున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఇసుక‌ను ఉచితంగా వాడుకోమ‌ని చెబుతున్నాం, ఎవ‌రైనా అడ్డుప‌డితే తిరబ‌డి తీసుకెళ్ల‌మ‌ని చెప్తున్నామ‌న్నారు.

అంతేగానీ, ఇదేదో మాఫియాగా తెలుగుదేశం పార్టీ చేస్తోంద‌ని విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. ఎక్క‌డైనా ఎవ‌రైనా ఏదైనా త‌ప్పులు చేస్తే మీరే ఎదిరించండ‌నీ, అవ‌స‌రమైన సాయం చేస్తాన‌ని అన్నారు. అన‌వ‌స‌రంగా ఈ విష‌యాన్ని రాజ‌కీయం చెయ్యొద్ద‌ని ఈ నాయ‌కుల్ని కోరుతున్నా అన్నారు. నీతిమంతంగా, టెక్నాల‌జీ సాయంతో దేశంలోనే నంబ‌ర్ వ‌న్ పాల‌న అందించే దిశగా ప్ర‌య‌త్నం చేస్తుంటే నింద‌లు వేస్తారా అని మండిప‌డ్డారు. వీరు భాజ‌పాపై మాట్లాడ‌ర‌నీ, కేంద్రం పై పోరాటం చెయ్య‌ర‌నీ, బాగా ప‌నిచేస్తుంటే మ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తార‌న్నారు.

రాష్ట్ర రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు ఎప్ప‌టిక‌ప్పుడు అర్థం చేసుకోవాల‌న్నారు. 2004లో తెలుగుదేశం ఓడిపోయిన త‌రువాత రాష్ట్ర ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డ్డార‌న్నారు. ఆ ఇబ్బందులే 2014లో రాష్ట్ర విభ‌జ‌న‌కు దారి తీసింద‌న్నారు. ఈ రోజున ప్ర‌భుత్వం మ‌ళ్లీ కొన‌సాగితే అన్ని కార్య‌క్ర‌మాలూ సుజావుగా అవుతాయ‌న్నారు. కేంద్రంలో భాజ‌పా వ‌చ్చే అవ‌కాశం లేద‌నీ, ప్రాంతీయ పార్టీల హ‌వా ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇంత‌కుముందు కూడా తెలుగుదేశం జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పింద‌నీ, భవిష్య‌త్తులో కూడా కీల‌కం అయ్యేందుకు కృషి చేస్తున్నామ‌ని చంద్ర‌బాబు అన్నారు. దేశ‌వ్యాప్తంగా రైతులంద‌రూ ఇబ్బందుల్లో ఉన్నారనీ, స్వామినాథ‌న్ క‌మిటీ రిపోర్టును అమ‌లు చేస్తామ‌ని మేనిఫెస్టోలో కూడా చెప్పార‌న్నారు. ఈరోజున ఉత్త‌ర భార‌త‌దేశంలో ప‌ది రాష్ట్రాల్లో రైతులు ఆందోళన‌లు చేస్తుంటే, వారిని కేంద్రం ఎగ‌తాళి చేస్తోంద‌ని మండిప‌డ్డారు.

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇస్తూనే, జాతీయ రాజ‌కీయాల్లో టీడీపీ మ‌రోసారి కీల‌క‌మౌతుంద‌న్న ఆశాభావం కూడా వ్య‌క్తం చేశారు. ఇసుక ఉచితంగానే తీసుకుపొమ్మని ప్రభుత్వం చెబుతుంటే, మాఫియా అని పవన్ అంటారు. మరి, సీఎం ఇచ్చిన కౌంటర్ పై పవన్ మరోసారి స్పందిస్తారేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com