సుప్రీంకోర్టు వీధి కుక్కల విషయంలో ఇచ్చిన ఓ తీర్పుతో సెలబ్రిటీల ముసుగులో కొందరు ఏడుపు లంకించుకుంటున్నారు. చిత్రవిచిత్రాలు చేస్తున్నారు. అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటో వీరిలో చాలా మందికి తెలుసో లేదో చెప్పడం కూడా కష్టమే. సుప్రీంకోర్టు కేవలం ఢిల్లీ.. నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో ఉన్న వీధి కుక్కలను ప్రత్యేకంగా సంరక్షించమని చెప్పింది. వీధుల్లో కనిపించకుండా.. వాటి కోసం ప్రత్యేకంగా షెల్టర్ ఏర్పాటు చేయమని చెప్పింది. ఇదేదో పెద్ద నేరమైపోయినట్లుగా.. వాటిని చంపమన్నట్లుగా, జీవితాంతం జైల్లో ఉంచమని చెప్పినట్లుగా శోకాండాలు పెట్టేస్తూ కొంత మంది తెరపైకి వస్తున్నారు.
దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్య ఉంది. ఆ సమస్య అనుభవించేవారికి తెలుసు. పెంచుకునే కుక్కల్ని చాలా మంది బయటకు తీసుకు వచ్చి ఇళ్ల ముందు పనులు పూర్తి చేయించి తీసుకెళ్తూ ఉంటారు. వారే అలా ఉంటే ఇక వీధికుక్కలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇక ఆ వీధికుక్కలు ఎంత మంది వెంట పడి ఉంటాయో.. ఎంత మందిని కరిచాయో.. ఎంత మంది చావుకు కారణాలు అయ్యాయో సోషల్ మీడియాలో ఉంటాయి. ఈ సెలబ్రిటీలు ఎవరూ వీధి కుక్కుల బారిన పడరు. ఎప్పడైనా తమ కారు కింద పడినా పట్టించుకోరు. కానీ ఇప్పుడేదో సుప్రీంకోర్టు కుక్కల్ని చంపమని ఆదేశాలిచ్చినట్లుగా రెచ్చిపోతున్నారు.
కొంత మంది ఏకంగా సుప్రీంకోర్టు రేపిస్టుల్ని వదిలేస్తోంది కానీ కుక్కల్ని మాత్రం.. బంధించమంటోందని వెటకారం చేస్తున్నారు . ఇలాంటి వారికి అసలు సమస్య అర్థం కావడం లేదని అనుకోవాలి. ఎవరైనా వీధికుక్కలకు ఆహారం రోడ్డు మీద పెట్టడం ఎందుకు ఇంటికే తీసుకెళ్లి పెట్టవచ్చు కదా అని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నకు ఒక్కరూ సమాధానం చెప్పరు. ఇలా స్పందించేవారంతా.. తలా నాలుగు వీధి కుక్కల్ని తీసుకుని ఇంట్లో పెట్స్ లాగా పెంచుకోవచ్చు.కానీ ఒక్కరూ ముందుకు రారు. వాటిని అలా వదిలేయాలని మాత్రం ఏడుస్తూ వచ్చేస్తున్నారు.