మంత్రుల పనితీరును చంద్రబాబు ప్రశంసించలేకపోతున్నారు. 18 నెలలు అయినా పనితీరులో మార్పు చూపలేదని ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల నిధులు తీసుకురావడంలో మంత్రులు నిర్లక్ష్యం చూపుతున్నారని చంద్రబాబు లెక్కలు చెప్పారు. ఢిల్లీకి అధికారులతో కలిసి వెళ్లి సంబంధిత పథకాలకు నిధులు తీసుకురావాలని… మంత్రులు ఒక్క రోజు ఢిల్లీకి వెళ్లడంలో ఏమీ నష్టం లేదని సీఎం సూచించారు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలని మంత్రులను హెచ్చరించారు.
ప్రజలు మన పాలనపై నమ్మకం పెట్టుకుని ఓటు వేశారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలంటే మంత్రులు దూకుడుగా పని చేయాల్సిందేన్నారు. పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎంఏవైఅర్బన్ వంటి వాటికి మంత్రులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మంత్రులు చాలా మంది అధికారులకు వదిలేసి తమ వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించిన పేపర్ వర్క్ తో పాటు.. ఓ సారి ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రుల్ని, ఉన్నతాధికారుల్ని కలిస్తే.. సమస్యలు ఏమిటో తెలిసిపోతాయి. కానీ అధికారులు వెళ్లడం లేదు.
మరో వైపు మంత్రుల వ్యవహారశైలిపైనా చంద్రబాబు అంత సంతృప్తిగా లేరు. ప్రజల్లోకి వెళ్లడం సంగతి అటుంచి కనీసం గ్రీవెన్స్ ఏర్పాటు చేయడంలేదని అసంతృప్తిగా ఉన్నారు. అధికారిక సమావేశాల్లో చంద్రబాబు వ్యక్తం చేసే అసంతృప్తి.. కేవలం హెచ్చరికలేనని.. అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదని కొంత మంది భావిస్తూ ఉంటారు. కానీ పనితీరు బాగోలేకపోతే.. సమయం చూసి సరైన నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.