మెట్రో రైలు రాకలో టీడీపీ క్రెడిట్ కూడా ఉంద‌ట‌..!

త‌న హ‌యాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జ‌రిగింద‌ని తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు చాలా సంద‌ర్భాల్లో చెప్పుకుంటారు. న‌గ‌రానికి ఐటీ వ‌చ్చిందంటే కార‌ణం.. త‌న కృషే అంటుంటారు. నిజానికి, రాష్ట్రం విడిపోయినా, హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు నివాసం మార్చేసుకున్నా కూడా అప్పుడ‌ప్పుడూ ఇదే విష‌యం గుర్తుచేసుకుంటూ ఉంటారు ఏపీ సీఎం. హైద‌రాబాద్ కు అంత‌ర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది టీడీపీ స‌ర్కారు హ‌యాంలోనే అని అంటారు. అయితే, గ‌డ‌చిన రెండు రోజులుగా అందరి ద్రుష్టీ హైద‌రాబాద్ మీదే ఉంది. ఒక ప‌క్క అంత‌ర్జాతీయ స‌ద‌స్సు, మ‌రోప‌క్క మెట్రో రైలు ప్రారంభోత్స‌వం… భాగ్య‌న‌గ‌రం సందడిగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేసిన ఘ‌న‌త త‌మ‌దే అని తెరాస స‌ర్కారు చెప్పుకుంటే, మా హయాంలో ప్రారంభ‌మైంద‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. భాజ‌పా కూడా ఈ క్రెడిట్ లో త‌మ వాటా కూడా ఉంద‌న్న‌ట్టుగా చెబుతోంది. సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్టుగా… మెట్రో రైలు హైద‌రాబాద్ కి రావ‌డం వెన‌క టీడీపీ కృషి చాలానే ఉంద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన‌ట్టు క‌థ‌నాలు వ‌స్తుండ‌టం విశేషం!

హైద‌రాబాద్ మెట్రోకి సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున క‌థ‌నాల వ‌స్తుండ‌టంలో… ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఇదే అంశ‌మై మీడియా ప్ర‌తినిధులు మాట్లాడుకుంటున్నార‌ట‌. ఇదే టాపిక్ ను చంద్ర‌బాబు ముందు ప్ర‌స్థావిస్తే… మెట్రో రైలు హైద‌రాబాద్ కు తీసుకుని రావ‌డం కోసం గ‌తంలో తాను చేసిన ప్ర‌య‌త్నాన్ని గుర్తు చేసుకున్నార‌ట‌. ఎన్డీయే హ‌యాంలో ఈ మెట్రో రైలు ఆలోచ‌న మొద‌లైంద‌నీ, ఆ స‌మ‌యంలో అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళూరు న‌గ‌రాల‌ను మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం ఎంచుకున్నార‌నీ, అప్పుడు తాను పోరాడి ఆ జాబితాలో హైద‌రాబాద్ పేరు చేర్పించిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. అప్ప‌టి పట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి అనంత్ కుమార్ తో పోరాడాన‌నీ, హైద‌రాబాద్ కు మెట్రో రైలు ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించాన‌నీ, మెట్రో అవ‌స‌రం కేంద్రానికి విడ‌మ‌ర‌చి చెప్ప‌డం వ‌ల్ల‌నే ప్రాజెక్టు వ‌చ్చింద‌న్నారు. ఇదొక్క‌టే కాదు, ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ స‌ద‌స్సు జ‌రుగుతున్న ప్రాంగణం హెచ్ ఐసీసీ వేదిక‌, శంషాబాద్ విమానాశ్రయం.. ఇలా హైద‌రాబాద్ అభివృద్ధిలో టీడీపీ ముద్ర ఎప్పటికీ ఉంటుందని చంద్ర‌బాబు అన్నారు. త‌న హ‌యాంలో మెట్రో రైలు ప్రాజెక్టు రావ‌డం, అది ఇన్నాళ్ల‌కు పూర్తి కావ‌డం త‌న‌కు సంతోషంగా ఉంద‌ని చంద్ర‌బాబు అన్నారు.

మొత్తానికి, టీడీపీ కూడా హైద‌రాబాద్ లో మెట్రో రైలు ప‌రుగుల వెన‌క త‌మ వంతు కృషి ఉంద‌ని క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఏదైతేనేం, మెట్రో ప్రాజెక్టు హైద‌రాబాద్ కు రావ‌డం వెన‌క ఏదో ర‌కంగా త‌మ కృషి ఉంద‌ని అన్ని పార్టీలూ చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే… ప్రాజెక్టు ఆల‌స్యం కావ‌డానికి కార‌ణాలు మాత్రం ప‌క్క పార్టీల్లో వెతుకుతూ ఉండ‌టం! వైయ‌స్ తీరు వ‌ల్ల‌నే మెట్రో రైలు ఆల‌స్యం అయింద‌ని టీడీపీ అంటే, కేసీఆర్ వ‌ల్ల‌నే నిర్మాణం కొన్నాళ్లు నీరుగారింద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే మెట్రో రైలు పూర్త‌య్యేస‌రికి ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌ని తెరాస అంటోంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.