అనంతపురం జిల్లా తాడిపత్రి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మెప్పించేందుకు జేసీ కుటుంబం శతవిధాలా ప్రయత్నించింది. ముఖ్యంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి వినూత్నంగా స్పందించారు. అమరావతి చిహ్నంతో ఉన్న ఒక ప్రత్యేక లోగో బ్యాడ్జ్‌ను చంద్రబాబుకు అందజేసి తన నిబద్ధతను చాటుకున్నారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు విజన్‌కు తాము పూర్తి అండగా ఉంటామని చెప్పకనే చెప్పారు. జేసీ బ్రదర్స్ రాజకీయ వారసుడిగా అస్మిత్ రెడ్డి తనదైన శైలిలో పార్టీ అధినేత దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు , ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరిగిన జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి కూడా ఈ పర్యటనలో మెరిశారు. చంద్రబాబుతో ఆయన ఆత్మీయంగా భేటీ అయ్యారు. పవన్ రెడ్డిని చూసిన చంద్రబాబు ఎంతో ఆప్యాయంగా పలకరించడం, కొద్దిసేపు వ్యక్తిగత విషయాలపై చర్చించడం అందరి దృష్టిని ఆకర్షించింది. జేసీ కుటుంబం, చంద్రబాబు మధ్య ఉన్న పాత అనుబంధం ఏమాత్రం చెక్కుచెదరలేదని, భవిష్యత్తులో పవన్ రెడ్డి కూడా యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉందని ఈ భేటీ ద్వారా సంకేతాలు వెలువడ్డాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నారని, ఈ క్రమంలో చంద్రబాబు తాడిపత్రికి వచ్చి వారిని పలకరించడం ద్వారా కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సాగునీటి భద్రత, హంద్రీనీవా కాలువ విస్తరణ వంటి అంశాలపై సీఎం జరిపిన సమీక్షలు రైతుల్లో సానుకూలత పెంచగా, జేసీ కుటుంబం మళ్లీ పార్టీలో పట్టు సాధించేందుకు ఈ పర్యటనను వేదికగా మలుచుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
ముఖ్యంగా తాడిపత్రి అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే, తమ ప్రభుత్వ విజన్‌ను చంద్రబాబు ముందు జేసీ కుటుంబం ప్రదర్శించింది. ఏప్రిల్ నాటికి తాడిపత్రికి సోలార్ విద్యుత్ వస్తుందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పనులు పూర్తవుతాయని వివరించడం ద్వారా తాడిపత్రిని ఒక మోడల్ టౌన్ గా చూపుతున్నారు. అధినేత మెప్పు పొందడమే కాకుండా, రాబోయే రోజుల్లో జిల్లా రాజకీయాల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకునేలా ఈ పర్యటనను జేసీ కుటుంబం సక్సెస్ చేసుకుందని భావిస్తున్నారు.
