హోదా విష‌యంలో జాగ్ర‌త్త ప‌డుతున్న సీఎం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం! హామీ ఇచ్చిన కేంద్ర‌ం ఈ టాపిక్ వ‌దిలేసింది, అడ‌గాల్సిన రాష్ట్రమూ ప్ర‌త్యేక ప్యాకేజీతో మౌనం వ‌హించేసింది. కొన్నాళ్ల‌పాటు ప్ర‌త్యేక హోదా సెంటిమెంట్ ఏపీ ప్ర‌జ‌ల్లో బాగానే ఉంది. కాక‌పోతే, ఆ అసంతృప్తికి ఉద్య‌మ రూపం ఇవ్వ‌డంలో ప్ర‌తిప‌క్షం ఫెయిల్ అయింద‌నే చెప్పాలి. రాజీలేని పోరాటం చేస్తున్నామ‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌చ్చారు. యువ‌భేరి అంటూ కొన్ని స‌భ‌లు పెట్టి కొంత హ‌డావుడి చేశారు. ఆ త‌రువాత‌, వచ్చే ఎన్నిక‌ల మేనిఫెస్టో అంశంగా దీన్ని మార్చేశారు. ఇక, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అనీ, దానికి బ‌దులుగా కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన ల‌డ్డూ అనీ విమ‌ర్శించారు. అంతే… అక్క‌డితో జ‌న‌సేన పోరాటం కూడా ఏంట‌నేది అర్థం కాకుండా పోయింది. ప్ర‌స్తుతం ఆంధ్రాలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే! ప్ర‌తీరోజూ ఆయ‌న చేసే ప్ర‌సంగాల్లో ప్ర‌త్యేక హోదా రాష్ట్రానికి సంజీవ‌ని అనీ, హోదా వ‌స్తే ప‌రిశ్ర‌మ‌లు వస్తాయ‌నీ, ఉద్యోగాలు వ‌స్తాయంటూ చెబుతున్నారు. దీంతో అధికార పార్టీలో కూడా కొంత స్పంద‌న క‌నిపిస్తోంది! ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట‌ల్లో ఒక ర‌క‌మైన అప్ర‌మ‌త్త‌త ధ్వ‌నిస్తోంది.

నిజానికి, ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్యాకేజీ సాధించుకున్నామ‌ని చాలా గొప్ప‌గా టీడీపీ స‌ర్కారువారు చెప్పుకుంటూ వ‌చ్చారు. అయితే, హోదాకు స‌మానంగా ఆంధ్రాకు ద‌క్కిన ప్ర‌యోజ‌నాలేంటో ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌లేక‌పోతున్నారు! అసెంబ్లీలో ఇదే అంశ‌మై ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ… కేంద్రం కొత్త‌గా ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వ‌డం లేద‌నీ, అందుకే మ‌నం ప్ర‌త్యేక ప్యాకేజీని ఒప్పుకున్నామ‌ని సీఎం చెప్పారు. అంతేకాదు, కేంద్రం ఇచ్చిన విభ‌జ‌న హామీల విష‌యంలో రాజీప‌డేది లేద‌ని అన్నారు. ప్ర‌త్యేక ప్యాకేజీ ఇంకా ఫైన‌ల్ కాలేద‌న్నారు! రాష్ట్రానికి ఎంతిస్తారో అనేది ఇంకా కేంద్రం నుంచి స్ప‌ష్ట‌త రావాల్సి ఉంద‌ని చంద్రబాబు అన్నారు. ప్ర‌త్యేక హోదాపై పోరాటం చేసేవాళ్లు ఇక్క‌డి కాద‌నీ, ఢిల్లీకి వెళ్లి ప్ర‌య‌త్నాలు చేయాల‌ని సూచించారు. ఆందోళ‌న పేరుతో ప్ర‌జ‌ల్లో అభ‌ద్ర‌తాభావాన్ని సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అన్నారు.

ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ఢిల్లీకి వెళ్లాలంటూ ప‌రోక్షంగా సీఎం సూచించింది ప్ర‌తిప‌క్షాన్నే క‌దా! ప్రతిపక్ష పోరాటాలేంటనేది కాసేపు పక్కన పెడదాం. ఇంత‌కీ హోదా కోసం టీడీపీ చేసిన పోరాటమేంటో వారు చెప్ప‌లేరు క‌దా! క‌నీసం సాధించామ‌ని గొప్ప‌గా చెప్పుకున్న ప్ర‌త్యేక ప్యాకేజీకి సంబంధించిన కేటాయింపుల‌పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేద‌ని ముఖ్య‌మంత్రే చెబుతున్నారు. రాష్ట్రానికి ఎన్నో స‌మ‌స్య‌లున్నాయ‌నీ, నిధులు చాలా అవ‌స‌ర‌మ‌నీ ఆయ‌నే అంటున్నారు. అలాంట‌ప్పుడు, కేంద్రంపై వారు పెంచుతున్న ఒత్తిడి ఏంట‌నేది కూడా సీఎం చెబితే బాగుండేది! ఇప్పుడు ప్ర‌త్యేక హోదా అంశాన్ని మ‌రోసారి జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నారు కాబ‌ట్టి, ఈ టాపిక్ మీద ఆయ‌న స్పందించిన‌ట్టుగా ఉంది. హోదాతోనే అభివృద్ధి సాధ్యం అని జ‌గ‌న్ చెబుతున్న‌ప్పుడు… తాము సాధించిన ప్యాకేజీ కూడా అంత‌కంటే ఎక్కువ ప్ర‌యోజ‌నాల‌తో కూడుకొన్న‌ద‌ని చంద్ర‌బాబు స‌ర్కారు ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది క‌దా! ఢిల్లీ వెళ్లి పోరాటాలు చేసుకోండ‌ని చెప్తే స‌రిపోదు క‌దా. ఆ లెక్కన చంద్రబాబు కూడా తరచూ ఢిల్లీ వెళ్లి వస్తున్నారు. ప్యాకేజీ కేటాయింపులపై స్పష్టత ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com