తెలంగాణలో రెండో విడత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని చూపిస్తోంది. కనీసం అరవై శాతం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. రెండో విడతలో 4332 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. కొన్ని చోట్ల చెదరుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముసిగింది. ఆ తర్వాత రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. మేజర్ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కాస్త ఆలస్యమవుతోంది. చిన్న పంచాయతీల్లో ఫలితాలు వెంటనే తెలుస్తున్నాయి.
రెండో విడతలో ఇప్పటి వరకూ 1500కుపై పంచాయతీల ఫలితాలు వచ్చాయి. ఇందులో 800కుపైగా కాంగ్రెస్ మద్దతుదారు అభ్యర్థులు గెల్చుకున్నారు. తర్వాత స్థానంలో బీఆర్ఎస్ ఉంది. ఆ పార్టీ 300కుపైగా పంచాయతీల్లో తమ మద్దతుదారులను గెలిపించుకుంది. తర్వాత స్వతంత్రులు ఎక్కువగా సర్పంచ్ పీఠాలను దక్కించుకుంటున్నారు. 250కుపైగా పంచాయతీలో ఏ పార్టీ మద్దతివ్వని వారు.. రెబల్స్ ఎక్కువగా విజయం సాధిస్తున్నారు.
మరో విడత ఎన్నికలతో దాదాపుగా 12 వేల పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయిపోతాయి. ఆ వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక కూడాపూర్తి చేసేలా ఎస్ఈసీ షెడ్యూల్ ఖరారు చేసింది. పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తేనే వాటికి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు వస్తాయి. అందుకే వేగంగా ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. పరిషత్ ఎన్నికలు.. మున్సిపల్ ఎన్నికలకు కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది.