హైదరాబాద్‌లోని అధికారులు భవన నిర్మాణ అనుమతుల విషయంలో తీసుకు వస్తున్న సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వేగంగా అనుమతులు ఇస్తున్నామని అంటున్నారు. తాజాగా బిల్డ్ నౌ యాప్ ద్వారా ఏకంగా 69 అంతస్తుల భవనానికి అనుమతి ఇచ్చినట్లుగా ప్రకటించారు. బిల్డ్‌నౌను ఆవిష్కరించినప్పటి నుండి దాదాపుగా 14వేల వరకూ అనుమతుల కోసం అప్లికేషన్లు వచ్చాయని.. వాటిని వివిధ స్థాయుల్లో అధికారులు 48,495 సార్లు స్ర్కూటినీ చేలి వేగంగా పర్మిషన్లు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. గంటలోగానే పని అయిపోతుందని అంటున్నారు.
భవన నిర్మాణ, లే అవుట్ అనుమతులు లంచాల బాధ లేకుండా జారీ చేసేందుకు ప్రభుత్వం బిల్డ్‌నౌ యాప్ తెచ్చింది. ఎన్ని అంతస్తుల భవన నిర్మాణ దరఖాస్తు అయినా ఈ యాప్ లోనే అనుమతి తీసుకోవచ్చు. గతంలో టీజీబీపాస్ ద్వారా అనుమతులు ఇచ్చేవారు. అయితే ప్రాసెస్ ఆలస్యమయ్యేదన్న విమర్శలు ఉన్నాయి.
ఎన్ని అంతస్తుల భవనమైతే అన్ని ఎక్కువ రోజులు కేవలం దరఖాస్తు స్ర్కూటినీకే సమయం సరిపోయేది. బిల్డ్‌నౌను తొలుత జీహెచ్ఎంసీలో అమలు చేయగా.. ఆ తర్వాత హెచ్ఎండీఏతో పాటు డీటీసీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్నీ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో అమలు చేస్తున్నారు.
దక్షిణాదిలోనే అత్యంత ఎత్తైన భవనం కోకాపేటలో 69 అంతస్తులతో నిర్మించడానికి హెచ్ఎండీఏకు ఓ బిల్డప్ దరఖాస్తు చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏలలో బహుళ అంతస్తుల భవనాల స్ర్కూటినీ ప్రక్రియ బిల్డ్ నౌ యాప్ లో వెంటనే పూర్తవుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే జీవో 168 నిబంధనల ప్రకారం వివరాలు నమోదు చేసేలా బిల్డ్‌నౌను రూపొందించారు. ఆ నిబంధనల ప్రకారం వివరాలుంటేనే ఆ దరఖాస్తును బిల్డ్‌నౌ స్వీకరిస్తుంది. ఈ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేయడం సామాన్యులకు పెను భారంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి.