కాంబినేషన్ కి టాలీవుడ్ లో పెద్ద పీట వేస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫలానా హీరో, ఫలానా దర్శకుడితో సినిమా తీస్తే బాగుణ్ణు అనుకొనేవాళ్లెంతో మంది. హీరోల అభిమానులకు ఫేవరెట్ డైరెక్టర్లంటూ ఉంటారు. వారిద్దరి కాంబోలో సినిమా వస్తే చూడాలని ఆశ పడుతుంటారు. అలాంటి కాంబో సెట్టయితే.. అభిమానులకు పండగే. అలాంటి అరుదైన కాంబినేషన్ల గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చ సాగుతోంది.
అగ్ర దర్శకుల కళ్లన్నీ ప్రభాస్ పైనే ఉంటాయి. ప్రభాస్ దొరికాడంటే.. తమ అస్త్రాలను పదును పెట్టాలని చూస్తుంటారు. సుకుమార్‌కు సైతం ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని కోరిక. ప్రభాస్ అభిమానులు సైతం ఆ ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు. చాలా కాలం నుంచి వీరిద్దరి కాంబో గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ.. అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మరోసారి ఇలాంటి వార్తే బయటకు వచ్చింది. ప్రభాస్ – సుకుమార్ త్వరలోనే కలిసి పని చేయబోతున్నారని, ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించబోతోందన్నది వార్తల సారాంశం. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అంశమే. సుకుమార్ స్టామినా ఏమిటో.. వాళ్లకు బాగా తెలుసు. ప్రభాస్ లాంటి స్టార్.. సుకుమార్ లాంటి క్రియేటీవ్ డైరెక్టర్ తో పని చేస్తే అంతకంటే క్రేజీ కాంబినేషన్ ఏముంటుంది? సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యేడాదే సెట్స్ పైకి వెళ్తుంది. అది అయ్యాక… ప్రభాస్ తో పని చేయడం ఖాయమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
రామ్ చరణ్ – త్రివిక్రమ్ కాంబో గురించి కూడా అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మెగా హీరోల్లో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌లతో పని చేసి సూపర్ హిట్లు ఇచ్చాడు త్రివిక్రమ్. చరణ్ తో కూడా ఓ సినిమా చేస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకొన్నారు. ఈ కాంబోలో ఓ సినిమా రాబోతోందని రెండు మూడేళ్లుగా చెబుతూనే వస్తున్నారు. వీరిద్దరి మధ్య పలు దఫాలు చర్చలు కూడా సాగాయి. అయితే ఇప్పుడు ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని టాక్. పవన్ కల్యాణ్ క్రియేటీవ్ వర్స్క్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ నిర్మించనున్నారు. పవన్ తన బ్యానర్ ని పునరుద్ధరించాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. అది ఈ సినిమాతోనే మొదలయ్యే ఛాన్స్ వుంది. ఈ రెండు కాంబోలు ఎప్పుడు పట్టాలెక్కినా ఫ్యాన్స్ కి పండగే. బాక్సాఫీసు కూడా ఇలాంటి మూమెంట్ కోసమే ఎదురు చూస్తోంది.
