ధనుష్, ఆనంద్ ఎల్. రాయ్‌ల ‘రాంఝనా’ సినిమా ఏఐ సాయంతో క్లైమాక్స్‌ని మారుస్తూ రీరిలీజ్ చేసిన వ్యవహారం సినీ పరిశ్రమలో పెద్ద చర్చకే దారి తీసింది. ధనుష్, దర్శకుడు ఇద్దరూ దీనిపై తీవ్రంగా స్పందించారు. సినిమాకి ఆత్మని చెడగొట్టే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. నిజానికి ఇది మంచి ట్రెండ్ కాదు. భవిష్యత్తులో ఇలాంటివి నివారించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.
ఒక సినిమా దర్శక, రచయితల ఇంటెలెక్టువల్ ప్రాపర్టీ. వాళ్ల అనుమతి లేకుండా మార్పులు చేయడం సరికాదు. రీ-రిలీజ్ చేసేటప్పుడు కూడా వాళ్ల అభిప్రాయం తీసుకోవాలనే చర్యలు తీసుకోవాలి. ఏఐతో ట్రైలర్ కట్ చేయడం, చిన్న మార్పులు చేయడం ఓకే. కానీ కథని, క్లైమాక్స్‌ని మార్చేయడం అన్యాయం. ఏఐను ఎక్కడ, ఎంతవరకు వాడాలో నియమాలు పెట్టుకోవాలి. ఈ విషయంలో దర్శకులు ముందుకు రావాలి.
ఏఐతో నటులకు ఇంకా ముప్పు ఉంది. తమ ఇమేజ్‌తో తోచినట్లు సన్నివేశాలని మార్చేస్తే, రిక్రియేట్ చేసేస్తే నటుల ఉనికే ప్రమాదం. కాబట్టి నటీనటులు ఇక సినిమా సైన్ చేసే ముందే భవిష్యత్తులో ఈ సినిమాని ఏఐ ఎడిట్ చేస్తే తప్పకుండా తమ అనుమతి ఉండాలనే నిబంధనని పెట్టుకోవాలి. ఇక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఒప్పందం చేసుకునేటప్పుడు భవిష్యత్తులో సినిమా మీద ఏమైనా మార్పులు చేయాలంటే దర్శకుడి అనుమతి తీసుకోవాలన్న షరతు తప్పనిసరిగా పెట్టాలి.
సినిమా మనిషి సృష్టించిన కళ. దాన్ని మానవ ఆవిష్కరణగా గౌరవించాలి. టెక్నాలజీ సినిమా ఉన్నతికి సహకరించాలే కానీ ఆధిపత్యం చెలాయించకూడదు. నటులు, రచయిత, దర్శకుల గౌరవం కాపాడాలి. ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకునే అవసరం ఎంతైనా ఉంది.