ఎలాంటి అంచనాలు లేకుండానే సంచలనాలు సృష్టించింది ‘దురంధర్’. వెబ్ సిరీస్ ఫార్మెట్ లో తీసిన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. భారీ అంచనాలతో వచ్చినా సరే ‘దురంధర్ 2’ రికార్డుల మోత మోగించింది. ఇప్పటికీ బాలీవుడ్ లో ఈ సినిమా గురించి మాట్లాడుకొంటున్నారు. న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ కి ‘దురంధర్’ అనేది ఓ దిక్చూచీగా మారిపోయింది. ‘దురంధర్ 3’ ఎప్పుడు అనే ప్రశ్న సహజంగా రేకెత్తడం ఖాయం. ఎందుకంటే ఈ ఫ్రాంచైజీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఏ నిర్మాత, ఏ దర్శకుడైనా సరే, ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకొంటాడు. కానీ ఆదిత్యాధార్ మాత్రం ‘దురంధర్ 3’ ఆలోచన లేదని స్పష్టంగా చెప్పేశాడు. దాని బదులుగా మరో కొత్త కథ, కొత్త ఫ్రాంచైజీకి అంకురార్పణ చేయడం సబబని భావిస్తున్నాడు. కాకపోతే.. ‘దురంధర్ 3’ చేయాలన్న బత్తిడి ఆదిత్యపై పెరుగుతూనే ఉంది. ఇంత మంచి ఫ్రాంచైజీని వదులుకోవడం తెలివితక్కువ నిర్ణయం అని ఆయన సన్నిహితులు ఆదిత్య ని సున్నితంగానే హెచ్చరిస్తున్నారు.
దాంతో మధ్యే మార్గంగా ఆదిత్యాధార్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదేమిటంటే.. ‘దురంధర్ 3’ ఉంటుంది కానీ, ఈ టీమ్ తో కాదు. హీరోతో సహా, దర్శకుడు, మిగిలిన టీమ్ మొత్తం మారిపోతుంది. దురంధర్ అనే ఫ్రాంచైజీని ఎప్పటికప్పుడు కొత్త వాళ్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నాడు ఆదిత్య. ఓరకంగా ఇది మంచి ఆలోచనే. మార్కెట్ ని క్యాష్ చేసుకొంటూనే, ఈ ఫ్రాంచైజీని జనంలో ఉండేలా చూసుకోవొచ్చు. కాకపోతే రణవీర్ లేకుండా ఈ ఫ్రాంచైజీ ముందుకు వెళ్తుందా అనేది ఆలోచించాల్సిన విషయం. ఆయన ఫ్యాన్స్ ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకొంటారన్నది చాలా ముఖ్యం. రణవీర్ కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమాతో. ఆయన్ని మరిపించే నటుడ్ని తీసుకురావడం చాలా కష్టం. కాకపోతే.. ఆదిత్య ఆలోచనలు వేరేలా ఉన్నాయి. ఆయన ఇప్పుడు శూన్యంలోంచి కూడా అద్భుతాలు సృష్టించగలడన్న నమ్మకాన్ని సంపాదించుకొన్నాడు. ఆదిత్య మైండ్ లో ‘దురంధర్ 3’ గురించిన ఆలోచనలు ఎలా ఉన్నాయో, అవి ఎప్పుడు బయటకు వస్తాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈలోగా బయట మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి.
