2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపు కోసం ఐ ప్యాక్ పని చేసింది. ప్రశాంత్ కిషోర్ స్వయంగా వ్యూహాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన డీఎంకే దూరమయ్యారు. మరి ఇప్పుడు డీఎంకేకు వ్యూహకర్త ఎవరు?. ఎవరో కాదు.. స్టాలిన్ అల్లుడే. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి డిప్యూటీ సీఎంగా , వారసుడిగా తెరపై ఉన్నారు. కానీ ఆయన అల్లుడు మాత్రం డీఎంకే వ్యూహాల్లో తెర వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయన పేరు శబరీశన్.
స్టాలిన్ అల్లుడు ట్రబుల్ షూటర్
శబరీశన్ ఎప్పుడూ తెర ముందుకు రాలేదు. డీఎంకేలో ఆయనకు ఎటువంటి అధికారిక పదవి లేదు. ఆయన పార్టీలో కీలకంగా ఉంటారు. గత దశాబ్ద కాలంగా స్టాలిన్ గెలుపు గుర్రాలను సిద్ధం చేయడంలో శబరీశన్ కీలక పాత్ర పోషించారు. శబరీశన్ ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, కేవలం ఎన్నికల డేటా విశ్లేషణ, అభ్యర్థుల ఎంపిక, సోషల్ మీడియా మేనేజ్మెంట్ వంటి వ్యూహాత్మక అంశాలను పర్యవేక్షించేవారు. అయితే, ఇప్పుడు ఆయన తెరపైకి వస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పలు ప్రచార సభల్లో స్టాలిన్ పక్కన కనిపిస్తున్నాయి.
తెర వెనుక ఆయనే సూపర్ పవర్
డిఎంకెలో అంతర్గతంగా తలెత్తుతున్న విభేదాలను పరిష్కరించడంలో శబరీశన్ ట్రబుల్ షూటర్ గా వ్యవహరిస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో సీనియర్ నేతల మధ్య ఉన్న విబేధాలను సర్దుబాటు చేస్తూ, పార్టీ క్యాడర్ను ఎన్నికల దిశగా సమాయత్తం చేసే బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు. సీట్ల పంపకాల విషయంలో మిత్రపక్షాలతో చర్చలు జరపడంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. స్టాలిన్ కు షాడో లా వ్యవహరిస్తూ, పార్టీ అధికార కేంద్రంగా ఆయన ఎదిగారనే ప్రచారం జరుగుతోంది.
ప్రశాంత్ కిషోర్ తరహాలో గెలిపిస్తాడా?
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు డిఎంకెకు అత్యంత ప్రతిష్టాత్మకం. కేవలం సంప్రదాయ రాజకీయాలతోనే కాకుండా, ఆధునిక ఎన్నికల వ్యూహాలతో ముందుకు వెళ్లాలని శబరీశన్ నిర్ణయించుకున్నారు. ఐప్యాక్ వంటి సంస్థల సహకారంతో గతంలో సాధించిన విజయాలను ఈసారి తన సొంత వ్యూహాలతో పునరావృతం చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. తమిళనాడు రాజకీయ చదరంగంలో శబరీశన్ ఇప్పుడు ఒక నిశ్శబ్ద అస్త్రం నుండి బహిరంగ సైన్యాధిపతిగా బయటకు వస్తున్నారు. ఇది రాజకీయ విమర్శలకూ కారణం అవుతోంది.
