రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.. కేవలం ప్రయోజనాలు మాత్రమే శాశ్వతం. కేంద్రంలో టీడీపీకి ఉన్న బలం కీలకం కాబట్టి మోదీ, బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నాయని రేపు అవసరం లేకపోతే పక్కన పెట్టేస్తాయని రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు విశ్లేషిస్తున్నారు. రేవంత్ మాత్రమే కాదు చాలా మంది అదే అంటున్నారు. మరి బీజేపీతో ఉపయోగం లేకపోయినా టీడీపీ అంటి పెట్టుకుని ఉంటుందా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి నేతలు చేస్తున్న విశ్లేషణలు రాజకీయ కోణంలో నిజమే కావచ్చు కానీ, లోతుగా పరిశీలిస్తే ఇది కేవలం బలాబలాల మధ్య జరిగే వ్యూహాత్మక చదరంగమే రాజకీయం.
బలమే ప్రాధాన్యతకు గీటురాయి
కేంద్రంలో టీడీపీకి ఉన్న బలాన్ని బట్టే ప్రధాని మోదీ ఆ పార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నారన్నది అక్షర సత్యం. లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వ మనుగడకు చంద్రబాబు మద్దతు అత్యవసరం కాబట్టే, నేడు అమరావతికి నిధులు గానీ, పోలవరం ప్రాజెక్టుకు సహకారం గానీ లభిస్తున్నాయి. ఒకవేళ బీజేపీకి రేపు పూర్తి స్థాయి సొంత మెజారిటీ వస్తే టీడీపీ ప్రాధాన్యత తగ్గుతుందనే వాదనలో వాస్తవం ఉన్నప్పటికీ, అది కేవలం బీజేపీకి మాత్రమే పరిమితం కాదు. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తన సొంత బలం పెరిగినప్పుడు మిత్రపక్షాల మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూడటం సహజమైన పరిణామం.
రాజకీయం – ఒక ప్రజాస్వామ్య లావాదేవీ
అనుబంధాలు, ఆప్యాయతలతో రాజకీయాలు నడుస్తాయని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఒకరితో ఒకరికి ఎంత మేర ప్రయోజనం కలుగుతుందన్న దానిపైనే పొత్తుల మనుగడ ఆధారపడి ఉంటుంది. గతంలో శివసేన, అకాలీదళ్ వంటి పార్టీలకు ఎదురైన అనుభవాలను ఉదాహరణలుగా చూపుతున్నప్పటికీ, అవి ఆయా పార్టీల స్థానిక రాజకీయ వ్యూహాల వైఫల్యం వల్లకూడా ఆ పార్టీలు దెబ్బతున్నాయి. టీడీపీ కూడా గతంలో బీజేపీని వీడి నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి.
తగ్గించుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు !
పొత్తులో ఉన్నప్పుడు ఏపీలో బీజేపీ తనను తాను తగ్గించుకోవాలని అనుకోదు. అది క్షేత్రస్థాయిలో బలపడాలనే ప్రయత్నిస్తుంది. అదే సమయంలో టీడీపీ కూడా తన ప్రాభవాన్ని కాపాడుకుంటూనే ప్రత్యామ్నాయ శక్తులను నియంత్రించాలని చూస్తుంది. ఈ బలపడే ప్రయత్నం పొత్తులో ఘర్షణకు దారితీసినప్పుడే సమస్యలు వస్తాయి. కానీ, ప్రస్తుతానికి బీజేపీకి దక్షిణాదిలో ఒక బలమైన మిత్రపక్షం అవసరం, అలాగే టీడీపీకి కేంద్రం నుండి భారీ ఆర్థిక ప్యాకేజీల అవసరం ఉంది. ఈ ఉభయకుశలోపరి స్థితి ఉన్నంత కాలం ఈ బంధం కొనసాగుతుంది.
దూరదృష్టితో కూడిన అడుగులు
చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నేతకు బీజేపీ నైజం తెలియనిది కాదు. 2018లో ఎన్డీఏ నుండి బయటకు వచ్చి మళ్లీ 2024లో కలవడం వెనుక ఉన్నది కేవలం రాష్ట్ర ప్రయోజనాలు , రాజకీయ మనుగడ మాత్రమే. రాజకీయాల్లో ఎవరినీ తప్పు పట్టాల్సిన పని లేదు. బీజేపీ తన విస్తరణవాద సిద్ధాంతంతో ముందుకు వెళ్తుంది, ప్రాంతీయ పార్టీలు తమ అనుకూలవాద సిద్ధాంతంతో మనుగడ సాగిస్తాయి. చివరికి ప్రజలకి కావాల్సింది అభివృద్ధి , సుస్థిరత. ఆ రెండూ ఈ పొత్తు ద్వారా అందుతున్నంత కాలం, విమర్శలు ఎన్ని వచ్చినా ఈ బంధం చెక్కుచెదరదు. బలం తగ్గిన రోజున ప్రాధాన్యత తగ్గుతుందనేది జగమెరిగిన సత్యం.. దానికి సిద్ధపడే ఏ పార్టీ అయినా పొత్తుల బాట పడుతుంది
