తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలు మాత్రం ముగియలేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యవస్థను రద్దు చేయాలని ప్రారంభంలో కాంగ్రెస్ ప్రభుత్వం భావించినప్పటికీ, రాజ్యాంగపరంగా, న్యాయపరంగా అటువంటి వెసులుబాటు లేదని స్పష్టమవడంతో ఇప్పుడు ఎన్నికల నగారా మోగించేందుకు సిద్ధమవుతోంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ముదురుతుండటంతో, ఓటర్ల సౌకర్యార్థం , యంత్రాంగంపై భారం పడకుండా ఉండటానికి వేసవి ముగిసిన తర్వాతే ఈ ప్రక్రియను చేపట్టాలని సర్కార్ యోచిస్తోంది.
పంచాయతీతో పూర్తి చేయకపోవడం మైనస్
పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ఆనవాయితీ. కానీ, బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలనే ప్రతిపాదనలు, దానికి సంబంధించిన న్యాయపరమైన అంశాల వల్ల పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికలను విడివిడిగా నిర్వహించాలని అనుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియగా, ఇప్పుడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను జూన్ లేదా జూలైలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ విడతల వారీ ఎన్నికల వ్యూహం పార్టీకి లాభిస్తుందా లేక నష్టాన్ని తెస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వాయిదాల పర్వం.. ప్రతిపక్షాలకు అస్త్రం
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరమైన చిక్కులను కొని తెచ్చుకుంటోంది. పాలనలో పట్టు సాధించే లోపే ఎన్నికలు వస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయనే భయం అధికార పార్టీలో ఉందనే విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. , ఈ జాప్యం క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్లో నిరుత్సాహాన్ని నింపడమే కాకుండా, విపక్షాలకు విమర్శలు చేయడానికి అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలో వరుసగా ఎన్నికల వేడి కొనసాగనుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర ప్రధాన కార్పొరేషన్ల ఎన్నికలు లైన్లో ఉన్నాయి.
సాధారణ ఎన్నికల వేడి కూడా పెరుగుతుంది!
మరో ఏడాదిన్నర కాలంలోనే అసలైన అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలవుతుంది. ఈ తరుణంలో స్థానిక ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు రిఫరెండంలా మారనున్నాయి. వేసవి తర్వాత జరిగే ఈ మినీ కురుక్షేత్రం లో సత్తా చాటితేనే, భవిష్యత్తులో గ్రేటర్ ఎన్నికలను కాంగ్రెస్ ధీమాగా ఎదుర్కోగలదు. నిర్ణయాల్లో జాప్యం వీడి, స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం.
