పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు జాబితా గందరగోళం నెలకొంది. లక్షల మంది పేర్లను తొలగించడం ..వారిలో చాలా మంది న్యాయపోరాటం చేయడమే కారణం. ఓటరు జాబితా నుంచి పేర్లు లేని లక్షలాది మంది పౌరులు తమ ఓటు హక్కును తిరిగి పొందేందుకు న్యాయపోరాటం మొదలుపెట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 64 లక్షల మంది పేర్లు తొలగించారు. తమ పేర్లను తిరిగి చేర్పించుకునేందుకు బాధితులు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఆశ్రయిస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక ట్రిబ్యూనళ్లు
పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు 19 ప్రత్యేక అప్పీలేట్ ట్రిబ్యునళ్లను భారత ఎన్నికల సంఘం ర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు మేరకు ఈ ట్రిబ్యునళ్ల ఏర్పాటు జరిగింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అన్యాయంగా పేర్లు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని కోర్టు ఆదేశించింది. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సుల మేరకు ఈ ట్రిబ్యునళ్లకు నేతృత్వం వహించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులను ఎంపిక చేశారు. ఈ ట్రిబ్యునళ్లకు కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సారధ్యం వహిస్తున్నారు. ఈ ట్రిబ్యునళ్లు రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా పనిచేస్తాయి. అర్హులకు తిరిగి ఓటు హక్కు కల్పించడమే ఈ ట్రిబ్యునళ్ల ప్రధాన లక్ష్యం.
ట్రిబ్యూనళ్ల వద్దకు పరుగులు పెడుతున్న ఓటర్లు
తమ ఓటు తీసేసారనిచెప్పి ట్రిబ్యునల్ వద్ద బాధితుల తాకిడి పెరిగింది. పేర్ల స్పెల్లింగ్ తప్పుగా ఉండటం, లాజికల్ డిస్క్రిపెన్సీ వంటి కారణాలతో తమ ఓటు హక్కును తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు బాధితులు తమ తల్లిదండ్రుల వివరాలు, అవసరమైన అన్ని పత్రాలను సమర్పించినప్పటికీ, సాంకేతిక కారణాలతో పేర్లు తొలగించారని ట్రిబ్యునల్ అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఓటరు జాబితా ఇప్పటికే ఫైనల్ చేసిన నియోజకవర్గాల్లో కూడా బాధితులకు సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో స్వల్ప ఊరట లభించింది. పోలింగ్ జరగడానికి కేవలం రెండు రోజుల ముందు వరకైనా ట్రిబ్యునల్ అనుమతి పొందిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీని ప్రకారం, ఏప్రిల్ 21, ఏప్రిల్ 27 తేదీల్లో అనుబంధ ఓటరు జాబితాలను ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మనోజ్ అగర్వాలా నిర్ణయించారు. అంటే ఎన్నికలకు రెండు రోజుల ముందు వరకూ ఓటర్లను చేరుస్తూనే ఉంటారన్నమాట.
భారీ స్థాయిలో విచారణ
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, తొలగించిన 64 లక్షల మందితో పాటు మరో 60 లక్షల మంది ఓటర్లను పరిశీలన కేటగిరీలో ఉంచారు. వీరిలో దాదాపు 27 లక్షల మందిని ఇప్పటికే జాబితా నుంచి తొలగించగా, మిగిలిన వారిపై విచారణ కొనసాగుతోంది. రిటైర్డ్ జడ్జీల నేతృత్వంలోని ఈ 19 ట్రిబ్యునళ్లు లక్షలాది అప్పీళ్లను పరిష్కరించాల్సి ఉండటంతో, విచారణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇన్ని లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోకపోతే.. ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి.
