ఓ హీరో వంద కోట్ల పారితోషికం తీసుకొంటాడని తెలుగు ప్రేక్షకులు ఏనాడైనా ఊహించారా? కానీ ఈ రోజుల్లో ఈ మార్క్ చేరుకొన్న హీరోలు ఎంతోమంది కనిపిస్తారు. ప్రభాస్ ఇప్పటికే రూ.100 కోట్ల హీరో అయిపోయాడు. ‘వారణాసి’ కోసం మహేష్ బాబు లాభాల్లో వాటా అందుకోబోతున్నారు. ఆ అంకె.. వంద కోట్లని దాటే ఉంటుంది. ‘పుష్ప’ తరవాత అల్లు అర్జున్ రేంజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు.
‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. తన క్రేజ్, రేంజ్ మారిపోయాయి. ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ అయినా ఆ ఎఫెక్ట్ చరణ్‌పై పడలేదు. ‘పెద్ది’ కొస్తున్న హైప్, ఆ సినిమా క్రియేట్ చేస్తున్న బిజినెస్ ఇందుకు సాక్ష్యం. ఈ సినిమా కోసం చరణ్ రూ.120 కోట్ల వరకూ పారితోషికం అందుకొన్నారని టాక్. చరణ్ కెరీర్లో అందుకొన్న అత్యధిక పారితోషికం ఇదే. ‘పెద్ది’ తరవాత సుకుమార్ తో ఓ సినిమా చేస్తున్నాడు చరణ్. అందుకోసం మరో రూ.20 కోట్ల వరకూ అదనంగా తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. అంటే అటూ ఇటుగా రూ.140 కోట్లన్నమాట.
‘పెద్ది’ షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకొంది. ఓ ఐటెమ్ పాటతో పాటుగా, కొంత టాకీ పూర్తి చేస్తే చాలు. జూన్‌లో ఈ సినిమాని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే డేట్ ఇప్పటి వరకూ ఫిక్స్ చేయలేదు. జూన్ 4 న ‘టాక్సిక్’ రాబోతోంది. ఆ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ‘టాక్సిక్’ రాకపోతే.. ఆ డేట్ నే ‘పెద్ది’ ఫిక్స్ చేసుకొనే అవకాశాలు ఉన్నాయి.
