టాలీవుడ్ కంటూ ముఖ్యమైన సీజన్లు కొన్ని ఉంటాయి. సంక్రాంతి, వేసవి, దసరా.. సీజన్లు టాలీవుడ్ కి చాలా కీలకం. కాకపోతే.. ఈమధ్య అంతా సంక్రాంతిపై మాత్రమే ఫోకస్ పెట్టి, మిగిలిన సీజన్లు వదిలేస్తున్నారేమో అనిపిస్తోంది. పెద్ద సినిమాలన్నీ సంక్రాంతికి అట్లిపెట్టుకొని, వేసవి వచ్చేసరికి మొండి చేయి చూపిస్తున్నారు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల వేసవి సీజన్ చాలా ఏళ్లుగా వృధా అవుతోంది. ఈసారీ అదే జరగబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏప్రిల్, మే, జూన్.. ఈ మూడు నెలలూ టాలీవుడ్ కి కీలకం. మార్చి నుంచి కూడా కొత్త సినిమాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ఏప్రిల్ లో కూడా హడావుడి కనిపించలేదు. మార్చిలో రావాల్సిన పెద్ది, పారడైజ్ వాయిదా పడ్డాయి. ఏప్రిల్ లోనూ వీటి జాడ లేదు. కొత్త రిలీజ్ డేట్స్ ఇంకా ఖరారు చేయలేదు. ‘పారడైజ్’ ఎలాగూ బాగా వెనక్కి వెళ్లిపోయినట్టే. ‘పెద్ది’ అయినా వేసవిలో వస్తుందా? అనేది చూడాలి.
ఏప్రిల్ లో ‘బైకర్’, ‘డెకాయిట్’ మాత్రమే కొద్దో గొప్పో వసూళ్లు అందుకొన్నాయి. మిగిలిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. ఏప్రిల్ లో మరో రెండు వారాలు బాకీ. కానీ.. ఈ రెండు వారాలూ సినిమాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మే వసూళ్లపై మాత్రం టాలీవుడ్ కాస్తో కూస్తో ఆశలు పెట్టుకొంది. ‘మా ఇంటి బంగారం’, ‘స్వయంభూ’ సినిమాలు మేలో వస్తున్నాయి. ‘జెట్లీ’, ‘గాయపడ్డ సింహం’, ‘ఎపిక్’, ‘గోదారి గట్టుపైన’ లాంటి సినిమాలతో కాస్తో కూస్తో హడావుడి కనిపిస్తోంది. ‘స్వయంభూ’ భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా. సమంత క్రేజ్ తో ‘మా ఇంటి బంగారం’ మంచి ఓపెనింగ్స్ తీసుకొనే అవకాశం ఉంది. మిగిలిన సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే స్టఫ్ ఉన్నవే. ఏప్రిల్ లోటుని.. మేలో అయినా టాలీవుడ్ భర్తీ చేసుకొంటుందేమో చూడాలి.
