భారతదేశంలో ఉచితాల రాజకీయం అనగానే ముందుగా గుర్తొచ్చేది తమిళనాడే. అసలు ఎన్నికల వేళ ప్రజలకు వరాల జల్లు కురిపించడం ఎలాగో దేశానికి నేర్పిన ట్రెండ్ సెట్టర్ ద్రావిడ గడ్డ. తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ సాగుతున్న మేనిఫెస్టో వార్ చూస్తుంటే, తమిళ రాజకీయాల్లోని అతి ని బీట్ చేయడం ఎవరివల్ల కాదని మరోసారి స్పష్టమవుతోంది. ఒకరిని మించి మరొకరు ఇస్తున్న హామీలు సామాన్యుడిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.
పోటాపోటీ వరాలు
ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే విడుదల చేసిన మేనిఫెస్టో ఒక సంచలనం. మహిళలకు నెలకు రూ. 2,000 నగదు సాయం, ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నిటికీ మించి ఇంటికో ఉచిత ఫ్రిడ్జ్, పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలతో ఎడప్పాడి పళనిస్వామి ఓటర్లను కట్టిపడేశారు. దీనికి కౌంటర్ గా అధికార డీఎంకే కూడా తన ద్రావిడ మోడల్ లో భాగంగా భారీ లీకులను ఇస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను మరింత విస్తరించడంతో పాటు, నిరుద్యోగ భృతి పెంపు, మరిన్ని ఉచిత విద్యుత్ యూనిట్లపై స్టాలిన్ సర్కార్ కసరత్తు చేస్తోంది.
కొత్త ప్లేయర్.. విజయ్ మార్క్ పాలిటిక్స్
ఈ రేసులోకి సినిమా స్టార్ విజయ్ ఎంట్రీ ఇవ్వడం మరింత ఆసక్తిని రేపుతోంది. ఆయన తన మేనిఫెస్టోను సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. విద్యార్థులకు ఉచిత ట్యాబ్లెట్లు, రైతులకు ప్రత్యేక రాయితీలతో పాటు సంప్రదాయ పార్టీలకు దీటుగా వినూత్నమైన సంక్షేమ పథకాలను ఆయన ప్రకటించే అవకాశం ఉంది. కొత్త రక్తం.. కొత్త మార్పు అంటూనే తమిళ ఓటర్ల బలహీనత అయిన ఉచితాల పై విజయ్ కూడా గట్టిగానే గురిపెట్టారు.
జయలలిత, కరుణానిధిల లెగసీ
ఉచితాల విప్లవానికి పునాది వేసింది దివంగత నేతలు జయలలిత, కరుణానిధి. 2006లో కరుణానిధి తెచ్చిన ఉచిత కలర్ టీవీ పథకం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దానికి ధీటుగా జయలలిత మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు, ల్యాప్టాప్లు, అమ్మ క్యాంటీన్ల తో సంక్షేమాన్ని ఇంటింటికీ చేర్చారు. ఆ లెగసీని ఇప్పుడున్న నేతలు మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు టీవీతో మొదలై, ఇప్పుడు ఫ్రిడ్జ్ వరకు చేరిన ఈ ప్రస్థానం.. రేపు ఇంకేం చూపిస్తుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. తమిళ రాజకీయాల్లో భావోద్వేగాలు ఎంత బలంగా ఉంటాయో, ఈ ఉచితాల పోటీ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ఖజానాపై ఎంత భారం పడినా, ఓటర్లను ఆకట్టుకోవడంలో తమిళ నేతలు చూపే ఈ అతి ని దేశంలోని మరే రాష్ట్ర నేతలూ అందుకోలేకపోతున్నారు.
