ఆ సెంటిమెంట్ కేసీఆర్ కి తెలీదేమో?

పోచంపాడు బ‌హిరంగ స‌భను ముఖ్య‌మంత్రి కేసీఆర్ భారీ ఎత్తున నిర్వ‌హించారు. శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్టుకు గ‌త వైభ‌వం తీసుకొచ్చేందుకు సీఎం ప్ర‌య‌త్నిస్తున్నారు. స‌రిగ్గా ఏడాది లోపే ప్రాజెక్టు ప‌నుల్ని పూర్తి చేస్తామ‌ని కేసీఆర్ సంక‌ల్పించారు. 16 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు. ఎన్నాళ్లుగానో గొంతెండిపోయిన శ్రీరాం సాగ‌ర్ కు జ‌ల‌క‌ళ తీసుకొచ్చేందుకు కేసీఆర్ చేస్తున్న‌ది భ‌గీర‌థ ప్ర‌య‌త్న‌మే అనాలి. గోదావ‌రి జ‌లాల‌ను ప్రాజెక్టుకు మ‌ళ్లించే ప్ర‌య‌త్నమ‌నేది.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మం అన‌డంలో సందేహం లేదు. దీన్ని ఏడాదిలోగా పూర్తి చేయాల‌న్న కేసీఆర్ సంక‌ల్పం అభినంద‌నీయం.

అయితే, ఇంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ప్రాజెక్టును ముఖ్య‌మంత్రి చేప‌డుతున్న త‌రుణంలో… తెరాస వ‌ర్గాల్లో ఓ సెంటిమెంట్ చ‌ర్చ వినిపిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. న‌మ్మ‌కాల‌కు పెద్ద‌పీట వేసే కేసీఆర్ కు ఈ విష‌యం తెలీదేమో అని కొంత‌మంది వ్యాఖ్యానిస్తుండ‌టం విశేషం. శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్టుతో చాలామంది రాజ‌కీయ జీవితాలు మారిపోయాయి అనే సెంటిమెంట్ తెర‌మీదికి వ‌చ్చింది. ఈ ప్రాజెక్టుకు 1963లో పండిట్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ శంకుస్థాప‌న చేశారు. ఆ త‌రువాతి సంవత్స‌రంలో ఆయ‌న స్వ‌ర్గ‌స్థుల‌య్యారు. ఆ త‌రువాత‌, ప్ర‌ధానిగా పీవీ న‌ర‌సింహ‌రావు హ‌యాంలో వ‌ర‌ద కాలువ‌ల ప‌నుల‌ను ప్రారంభించారు. ఆయ‌నే స్వ‌యంగా శంకుస్థాప‌న చేశారు. విచిత్రంగా.. ఆ త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో పీవీకి టిక్కెట్టే ద‌క్క‌లేదు! ఓసారి కాసు బ్ర‌హ్మానంద రెడ్డి కూడా ఈ ప్రాజెక్టును సంద‌ర్శించారు. ఆ త‌రువాత‌, మ‌ళ్లీ ఆయ‌న ముఖ్య‌మంత్రి కాలేక‌పోయారు. సీనియ‌ర్ నేత సోమ్ నాథ్ ఛ‌ట‌ర్జీ కూడా శ్రీరాం సాగ‌ర్ కు వ‌చ్చారు. త‌రువాత రాజ‌కీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు కూడా గుర‌య్యారు. మాజీ స్పీక‌ర్ సురేష్ రెడ్డి కూడా ఓసారి ఇక్క‌డికి వ‌చ్చారు. ఆ త‌రువాత నుంచే ఆయ‌న రాజ‌కీయ జీవితం మారిపోయింద‌నీ, నెమ్మ‌దిగా గుర్తింపు కోల్పోయార‌నీ అంటున్నారు.

ఇలా శ్రీరాం సాగ‌ర్ కు సంబంధించి రాజ‌కీయ వ‌ర్గాల్లో ఓ సెంటిమెంట్ ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చింది. నిజానికి, పైన చెప్పుకున్న నాయ‌కుల రాజకీయ జీవితాల్లో మార్పుల‌కు అస‌లైన కార‌ణాలు వేర్వేరుగా ఉండొచ్చు. కానీ, ఆయా కార‌ణాల్లో ‘శ్రీరాం సాగ‌ర్‌ ప్రాజెక్టు ద‌గ్గ‌ర‌కి రావ‌డం’ అనేది కామ‌న్ పాయింట్ కావ‌డం విశేషం. ఈ మ‌ధ్య రాజ‌కీయాల్లో ఇలాంటి న‌మ్మ‌కాల‌కే ప్రాధాన్య‌త పెరుగుతోంది. వాస్తు బాలేద‌న్న కార‌ణంతోనే స‌చివాల‌యానికి ముఖ్య‌మంత్రి రాని ప‌రిస్థితి! ఇంత‌గా ప‌ట్టింపులు ఉన్న కేసీఆర్ కు ఈ సెంటిమెంట్ విష‌యం ముందుగా తెలియ‌దేమో అని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిన‌ట్టు ఏడాదిలోగా ప్రాజెక్టు ప‌నులు పూర్త‌యితే ఇలాంటి న‌మ్మ‌కాల‌న్నీ తుడిచిపెట్టుకుపోతాయని కూడా మ‌రికొంద‌రు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com