“ మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి కడప నుంచి రౌడీలను పంపి.. హైదరాబాద్ పాతబస్తీలో మత కలహాలను సృష్టించిన రాజకీయం ఓ తరం మర్చిపోదు” . పదుల సంఖ్యలో ప్రాణాలు తీసి.. తమ రాజకీయం కోసం దేనికైనా తెగించే మనస్తత్వం ఉన్న రాక్షస రాజకీయాన్ని ఏపీ ప్రజలు అప్పుడే చూశారు. ఆ తర్వాత ఆ మత కలహాలను ఆపడానికి.. చాలా కాలం పట్టింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఉన్మాద రాజకీయం అదే నాయకుడి వారసుడి రూపంలో ఏపీలో వికృత తాండవం చేయడానికి రెడీ అయింది. సైలెంట్ గా తమ కుట్రలు ప్రారంభించేశారు. ఈ సారి వారి ఆయుధం మతం కాదు. కులం. కులం పేరుతో జనాలు కొట్టుకు చచ్చిపోవాలని భారీ కుట్ర చేస్తున్నారు. దీనికి ఆయుధంగా తమ వద్ద ఉన్న మీడియా, సోషల్ మీడియాను వాడుతున్నారు. ప్రజాధనం వేల కోట్లు దోచి.. పెట్టుకున్న ఈ ఆయుధాలతోనే వారు ప్రజల మధ్య కుల కాష్టం పెట్టడానికి ఎవరూ ఊహించనంత భారీ కుట్ర చేస్తున్నారు. దానికి తాజా ఉదాహరణలే ఇటీవల జరుగుతున్న పరిణామాలు. అవి ప్రారంభమే. కాను రాను రాను వారి కుట్రలు దాటుదేలిపోనున్నాయి. ఇందు కోసం బలి పశువుల్ని కూడా రెడీ చేసుకున్నారు. బలి ఇస్తారు.. రోడ్ల మీదకు వచ్చి రప్పా…రప్పా రాజకీయాలు చేస్తారు. ఇలాంటి ఘోరమైన రాజకీయాలు తప్పించుకోవాలంటే.. అలాంటి ఉన్మాద రాజకీయాలు పురిట్లోనే పాతేయాలి. దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
శవాలకు కులాలు అంటగట్టి క్షుద్ర రాజకీయాలు షురూ
నేరాలకు.. నేరగాళ్లకు కులమతాలుంటాయా?. కానీ వైసీపీకి మాత్రం శవాలకు కులాలు పెట్టేస్తుంది. ఎవరు చనిపోయిన తమకు అవసరమైన కులాన్ని ఆ శవానికి జోడించి రాజకీయం ప్రారంభించేస్తున్నారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా వస్తున్న వార్తలను చూస్తే.. రాష్ట్రంలో ఎవరు, ఎక్కడ చనిపోయిన వారు..తమ రాజకీయానికి ఎది ఉపయోగపడుతుందో చూసుకుని ఆ శవాలను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. శవాలను కనిపెట్టేందుకు.. చనిపోయిన వారి స్థితిగతులు, చనిపోయిన పరిస్థితుల్ని అంచనా వేసేందుకు ఎప్పటికప్పుడు ఓ నెట్ వర్క్‌ను రెడీ చేసుకుని వివరాలు ఎప్పటికప్పుడు తెప్పించుకుని.. వాటిలో తమ కుల రాజకీయాలకు అవసరమైన శవాలను ఎంపిక చేసుకుని సాక్షి పత్రిక ద్వారా.. వైసీపీ సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు. కందుకూరులో జరిగిన లక్ష్మినాయుడు హత్య విషయంలో వీరి ప్లాన్లు అమల్లోకి వచ్చాయి. హత్య జరిగిన మూడు, నాలుగు రోజుల తర్వాత కులం కోణం తీసుకు వచ్చి రాజకీయాలు చేశారు. చివరికి ప్రభుత్వం ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తే.. వెంటనే మరో టర్న్ తీసుకున్నారు. ఇతరుల్ని రంగంలోకి దింపి ఇష్టం వచ్చినట్లుగా సాయం చేయడంపైనా నిందలు వేయించారు. ఆ విషయం సద్దుమణగక ముందే గుంటూరు జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటే ఆమె శవానికి కూడా కులం ఆపాదించి.. టీడీపీ వాళ్ల వల్ల.. మరో సామాజికవర్గం వారి వల్లే ఆత్మహత్య చేసుకుందని ప్రచారం ప్రారంభించారు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాతే ఇది కూడా ప్రారంభమయింది. ఆమె కుటుంబసభ్యులు ఖండించినా ఆపడంలేదు. ఇంత పకడ్బందీగా శవాలను వెదుక్కుని కుల రాజకీయాలు ప్రారంభించడం వెనుక ఉన్న అసలు రాజకీయం చిన్న పిల్లవాడికి అర్థం అవుతుంది. రాష్ట్రంలో రెండు సామాజికవర్గాల మధ్య కుల చిచ్చు పెట్టి.. కుల ఘర్షణలు రేపి తాము చలి కాచుకోవాలని అనుకుంటున్నారు. ఇలాంటి ప్రయత్నంలో చివరికి హత్యలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే బాబాయ్‌నే లేపేసిన చరిత్ర వారి వెనుక ఉంది.
పావుల్ని కూడా రెడీ లచేసుకున్నారు !
వైఎస్ఆర్సీపీ కుల ఘర్షణలకు చేస్తున్న కుట్రల్లో కొంత మంది ఉద్దేశపూర్వకంగా పావులుగా మారుతున్నారు. ఓ కులాన్ని తిట్టడమే పనిగా పెట్టుకునే కొంత మందితో వైసీపీ ఒప్పందం చేసుకుంది. శవాలను వెదుక్కోవడానికే ఓ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నప్పుడు తమకు అవసరమైన కులఘర్షణల చిచ్చును పెంచడానికి అవసరమైన పావుల్ని వెదుక్కోవడం వారికి పెద్ద విషయం కాదు. అలాంటి వారిని అరడజన్ మందిని ఎంపిక చేసుకుని దాడులు ప్రారంభించారు. ఆ వ్యక్తుల పని ఓ కులాన్ని దూషించడమే. అయిన దానికి కాని దానికి.. కులాన్ని తీసుకు వచ్చి తిట్లందుకుంటూ ఉంటారు. వారి లక్ష్యం రెచ్చగొట్టడమే. ఈ అరడజన్ మంది…తాము జనసేన పార్టీ సానుభూతిపరులమన్నట్లుగా సంకేతాలు పంపుతూ ఉంటారు. అక్కడే ఉంది అసలు రాజకీయం. అసలు ఎప్పుడూ ఈ కులపరమైన వ్యాఖ్యలు చేసే ఎవరికీ జనసేన పార్టీలో పదవులు ఇవ్వలేదు. పార్టీ పరమైన కార్యక్రమాలకూ వారికి ఆహ్వానం లేదు. పవన్ కల్యాణ్ కూడా ఎప్పుడూ వారికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ వారు మాత్రం తమకు తాము జనసేన పార్టీ సానుభూతి పరులుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అది కూడా వైఎస్ఆర్సీపీ మీడియా, సోషల్ మీడియా సాయంతోనే. అంటే.. ఇక్కడే వైసీపీ అతి పెద్ద కుట్ర అర్థమైపోతుంది. వారిని జనసేన నేతలుగానే చూపిస్తూ.. ఓ కులం ప్రతినిధులుగా చూపిస్తూ.. మరో కులంపై దాడి చేయిస్తున్నారు. అంటే.. రెండు కులాల్లో ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుని కొట్టుకుని చావాలని అసలు ప్లాన్. ఇందులో ఈ అరడజన్ మంది సోకాల్డ్ జనసేన పార్టీ సానభూతిపరులు పావులు. వీరి లక్ష్యం.. వైసీపీని కానీ జగన్ ను కానీ ప్రశ్నించడం కాదు. తమ కులానికి మరో కులం వల్ల ఏదో జరిగిపోతుందని గగ్గోలు పెట్టేలా చేసి.. పవన్ కల్యాణ్‌ను కూడా ముగ్గులోకి లాగడం. పవన్ కూడా స్పందించేలా చేస్తే.. చాలు వీరి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. వైసీపీకి ఎవరూ చేయలేనంత సాయం చేసిన వాళ్లు అవుతారు. ఇక్కడ పవన్ కల్యాణ్ ను ఎందుకు లాగాలనుకుంటున్నారంటే.. ఆయనను ఓ కులపు లీడర్‌గా ప్రొజెక్ట్ చేయాలి. ఆయనను కాపుల లీడర్ గా చూపించాలి. అలా చూపిస్తే..ఈ కాపు నేతలు మరింత ఒత్తిడి చేసి కులం కోసం బయటకు వచ్చేలా చేయాలనుకుంటారు. అలా వస్తే పవన్ ఇక.. పూర్తిగా ట్రాప్ లో పడిపోతారు. ఆయనను కుల నేతగా ప్రొజెక్ట్ చేయడానికి వైసీపీ చేయాల్సినదంతా చేస్తుంది.
పవన్ కల్యాణ్‌పై చేస్తున్న అతి పెద్ద కుట్ర
పవన్ కల్యాణ్‌ను ఓ కులానికి పరిమితం చేయడమే ప్రస్తుతం వైసీపీ టాస్క్. కూటమితో కలిసి ఉన్నంత కాలం వైసీపీ గెలవదని పోల్ నిపుణులే కాదు.. జగన్ రెడ్డికి నమ్మకమైన శ్రేయోభిలాషిగా చెప్పుకునే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఎప్పుడో తేల్చి చెప్పారు. జగన్ రెడ్డికి ఉన్న ఇమేజ్, ఆయన చేతకానితనం, ఐదు సంవత్సరాల పాటు చేసిన పులకేశి పాలన ను ప్రజలు అంత త్వరగా మర్చిపోరు. మరో పదేళ్లు అయినా గుర్తు చేసుకుంటే ఉలిక్కి పడుతూనే ఉంటారు. అందుకే అది మర్చిపోయేలా చేయాలంటే…కుల గొడవలు మాత్రమే పరిష్కారమని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే.. విచ్చలవిడిగా తన కుల రాజకీయాలను చేస్తున్నారు. ఈ కుట్రలు ముందు ముందు ఎంత ఘోరంగా మారతాయో అంచనా వేస్తేనే.. జగన్ రెడ్డి రాజకీయ వ్యూహాల గురించి కాస్త అవగాహన ఉన్న వారికైనా ఒళ్లు జలదరిస్తుంది. జగన్ చాలా సింపుల్ గా రాజకీయాలు చేయాలనుకుంటారు. ఎంత సింపుల్ గా అంటే… వివేకానందరెడ్డి హత్య జరిగినంత సింపుల్ గా. చంపేసి..రక్తపు వాంతులు, గుండెపోటు లాంటి కథలు చెప్పి నమ్మించేందుకు .. పోస్టుమార్టం చేసే వరకూ ప్రయత్నించడం.. ఆ తర్వాత చంద్రబాబు చంపేశారని గడుసుగా ప్రచారం చేయడం వరకూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్ని మెప్పించడం రాదని పాలనతోనే తెలిసిపోయింది. ప్రజల్లోకి వచ్చేందుకూ ఆయన సిద్ధంగా లేరు. ఆయన సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఆయన దోచుకున్నారు. తన ఓటు బ్యాంక్ అయిన నిరుపేదల్ని, దళితుల రక్తాన్ని నకిలీ మద్యం పేరుతో జలగలు పీల్చినట్లుగా పీల్చి పడేశారు. ఆయనకు కనీస మానవత్వం , ప్రజల విషయంలో జాలి ఉంటుందని ఎవరూ అనుకోరు. ఆయన హావభావాలు చూస్తే.. హాలీవుడ్ సినిమాల్లో అత్యంత తీవ్రమైన నేరాలు చేసి..పైకి మాత్రం అత్యంత అమాయకంగా చేతులు నులుపుకుంటూ కనిపించే క్యారెక్టర్లు కనిపిస్తాయి. అలాంటి మనస్థత్వం ఉన్న వ్యక్తి చేతుల్లో ఐదేళ్లు పాలన సాగితే ఎన్ని కోట్ల మంది మానసిక , శారీరక టార్చర్ అనుభవించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు వచ్చిన సీట్ల సంఖ్యే ఆ విషయంపై స్పష్టత ఇస్తుంది. అయితే ఆ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోని ఆయన ప్రజల మెప్పు పొందే ప్రయత్నాలు చేయకుండా.. వారి మధ్య చిచ్చు పెట్టి.. కొట్టుకు చచ్చేలా చేసి..తాను రాజకీయంగా లబ్ది పొందాలనుకుంటున్నారు.
కులఘర్షణల కుట్రలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి !
ఇదంతా సీక్రెట్ గా జరగడం లేదు. అందరి ముందే జరుగుతోంది. ఆయన పత్రికల ద్వారా జరుగుతోంది. సోషల్ మీడియా ద్వారా జరుగుతోంది. ప్రతీ దానికి కులం ఆపాదించి రెండు వర్గాలను టార్గెట్ చేస్తున్న అంశం స్పష్టంగా కనిపిస్తోంది. మామూలుగా అయితే ఇలాంటి కులఘర్షణలు రేపే ప్రయత్నాలకు కఠినమైన కేసులు పెట్టి జైళ్లలో వేయాల్సి ఉంటుంది. ఇది అత్యంత తీవ్రమైన నేరం. ఇంకా ఎంత కాలం ఇలాంటి నేరాల్ని ప్రభుత్వం, పోలీసులు చూస్తూ ఉంటారో కానీ.. ఇలాంటి కుట్రలు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. జగన్ రెడ్డి దగ్గర డబ్బులకు కొదవలేదు. అదే సమయంలో ఆయన తన చేతుల్లో ఉండే పావుల్ని వాడుకునే వైనం కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పార్టీ పెట్టినప్పటి నుండి మైసూరా రెడ్డి నుంచి తన అక్రమాస్తులు పోగుపడేలా చేసిన విజయసాయిరెడ్డి వరకూ చాలా మందిని వాడుకుని వదిలేశారు. ఇక పార్టీలో అన్ని స్థాయిల్లో ఇలా వాడుకున్నవారి లెక్కలు తీస్తే వందల మంది ఉంటారు. చాలా మంది జైళ్లకు పోయారు.. పోతున్నారు కూడా. కానీ ఎప్పటికప్పుడు ఆయన కొత్త పావుల్ని వెదుక్కోవడమే కాదు.. వారంతా వచ్చి నేరుగా ఆయన ట్రాప్‌లో పడిపోవడమే ఆశ్చర్యపరిచే విషయం. ఆయన చేతుల్లో పడితే.. తమనే తాకు..తమను నమ్ముకున్న వారిని కూడా రోడ్డున పడేస్తారని తెలిసి కూడా.. పావులుగా మారుతున్నారు. రాష్ట్ర నాశనంలో భాగంగా మారుతున్నారు.
ఇలాంటి కుట్రల్ని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు.. ముఖ్యంగా ప్రభుత్వం అసలు నిర్లక్ష్యం చేయకూడదు. రాజకీయంగా ప్రభుత్వానికి.. కూటమికి నష్టం జరుగతుందా లేదా అన్నది తర్వాత విషయం. కానీ కుల చిచ్చు అంటూ వారి కుట్రలు ఫలించి ఏర్పడితే.. ఎంతో ఆస్తి నష్టం…ప్రాణనష్టం జరుగుతుంది. అల్లకల్లోలం జరుగుతుంది. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రజలూ నష్టపోతారు. అందుకే ఇలాంటి ఉత్పాతాల్ని ముందుగానే ఊహించి.. నిర్మూలించే ప్రయత్నం చేయాలి. లేకపోతే అది వైఫల్యమే అవుతుంది.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                              
 
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                 
                