అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ఎప్పుడైనా వస్తుందని లీకులు వస్తున్నాయి కానీ.. అసలు జాబితా మాత్రం బయటకు రావడం లేదు. కానీ ఎవరెరవికి టిక్కెట్ నిరాకరించబోతున్నారో మత్రం సంకేతాలు ఇస్తున్నారు. వారు తమ బలప్రదర్శన చేయడానికి వెనుకాడటం లేదు. అయితే బీఆర్ఎస్ రాజకీయంలోకి ఈటల చొచ్చుకొచ్చేస్తున్నారు. ఈ నెల 27వ తేదిన అమిత్ షా పర్యటన ఉందని.. అందులో ఊహించని చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఏకంగా ఇరవై రెండు మంది నేతలు చేరబోతున్నారని స్పష్టం చేశారు.
ఈటల చెప్పిన ఉద్దేశంలో ఈ ఇరవై రెండు మంది ఎవరో కాదు.. బీఆర్ఎస్ టిక్కెట్లు నిరాకరించబోయే ఎమ్మెల్యేలు. గతంలోలా ఈ సారి సిట్టింగ్లు అందరికీ కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం పాతిక మందికి టిక్కెట్ గల్లంతు అవుతుందని చెబుతున్నారు. అలాంటి వారికి ఎలంటి సిగ్నల్స్ రాలేదు. పైగా.. పార్టీ దూరం పెడుతున్న సంకేతాలు రావడం.. టిక్కెట్ దక్కుతుందని భావిస్తున్న వారి హడావుడి పెరగడంతో అలజడి ప్రారంభమవుతోంది. ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. వీరందరూ ప్రత్యామ్నాయంగా మరో పార్టీని చూసుకోవడం ఖాయమని అనుకోవచ్చు.
ఇప్పటికిప్పుడు జాబితాను ప్రకటిస్తే అడ్వాంటేజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈటల సంకేతాలు పంపించడంతో ఎందుకైనా మంచిదని .. జాబితాలను లీకులుగానే ఉంచితే మంచిదన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ హైకమాండ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేసినప్పుడు ప్రకటించడం వేరు.. ఇప్పుడు ఇంకా షెడ్యూల్ రాకుండానే అభ్యర్థుల జాబితా ప్రకటించడం తొందరపాటు అవుతుందని భావిస్తున్నారు.