ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి ప్రశ్నలు అడగాలి? అనే విషయంలో సినీ పాత్రికేయులకు ఇంకొంత అవగాహన ఏర్పడాల్సిన అవసరం ఉందన్న విషయం ఈమధ్య కొన్ని Q and A సెషన్లు, ఇంటర్వ్యూలు చూస్తుంటే అర్థం అవుతుంది. మైక్ ఉంది కదా, అడిగితే చెప్పేవాడు ఉన్నాడు కదా అని ఏది పడితే అది అడిగేసే తత్వం నుంచి పాత్రికేయులు పూర్తిగా బయటకు రావాలి. ఏదో సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరుగుతుంటుంది.. ఆ సినిమాకు సంబంధం లేని ప్రశ్నలు సంధిస్తుంటారు. ఆ ప్రశ్నలకూ, అప్పటి ఈవెంట్‌కూ సంబంధమే ఉండదు. చెబితే ఓ గొడవ. చెప్పకపోతే మరో బాధ. ఓ కొత్త సినిమాకు సంబంధించి హీరోనో, దర్శకుడో ఇంటర్వ్యూ ఇస్తాడు. ఆ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు కొన్నే ఉంటాయి. మిగిలినవన్నీ ఇతరత్రా విషయాలు. ప్రేక్షకులు, అభిమానుల మనసులోని సందేహాల్ని ప్రశ్నలుగా మార్చి అడగడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. కొన్ని కొన్ని ప్రశ్నలు, వాటికి సెలబ్రెటీలు చెప్పే సమాధానాలు.. సదరు సెలబ్రెటీపై గౌరవం పెంచేలా చేస్తాయి. అభిమానులు కొత్త సమాచారాన్ని అందిస్తాయి. అక్కడి వరకూ ఎవరికీ ఎలాంటి కంప్లైంట్ ఉండదు. చాలా చోట్ల మాత్రం సంస్కారాన్ని మర్చిపోతున్నారు పాత్రికేయులు. ‘హీరోయిన్ శరీరంపై పుట్టుమచ్చలెన్ని’ అనే ప్రశ్న దగ్గరే సినీ జర్నలిజం అభాసుపాలైంది. ‘మిమ్మల్ని కమిట్ మెంట్ అడిగారా’ అనే చోట.. ఇంకాస్త రోడ్డున పడింది. మున్ముందు ఇంకెన్ని చూడాలో అనే భయం పట్టుకొంది. సినిమా జర్నలిస్టుల్ని అసలు జర్నలిస్టులుగానే చూడడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ‘సినిమా జర్నలిజమా’ అని చిన్నచూపు చూస్తుంటారు. వాళ్లందరికీ ఇలాంటి విషయాలు మరింత వంత పాడుతుంటాయి.
మంచు లక్ష్మి – జర్నలిస్టు మూర్తి మధ్య జరిగిన వ్యవహారం తాజా అంశం. ప్రశ్నలతో సదరు జర్నలిస్టు నన్ను బాడీ షేమింగ్ చేశారు, ఆయనపై చర్యలు తీసుకోండి అంటూ మంచు లక్ష్మి ఓ లేఖ కూడా పంపడం చూశాం. ఆ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న సహేతుకం కాదు కానీ ఆ ప్రశ్నకు సరిపడా సమాధానం మంచు లక్ష్మి అక్కడే ఇచ్చేశారు. ‘ఈ ప్రశ్న హీరోల్ని అడగ్గాలరా’ అని లక్ష్మి గట్టిగానే నిలదీశారు.
ఇంటర్వ్యూ అయిపోయిన తరవాత ‘ఈ ప్రశ్నని డిలీట్ చేయండి..’ అని అడిగే అధికారం, హక్కూ కచ్చితంగా మంచు లక్ష్మికి ఉన్నాయి. ఆ పని చేసి ఉంటే బాగుండేది. కనీసం సదరు యూ ట్యూబ్ ఛానల్ అయినా, ఆ ప్రశ్న టెలీకాస్ట్ కాకుండా చూడాల్సింది. రెండూ జరగలేదు. ఇంటర్వ్యూలో ఆ బిట్ వైరల్ అయిన తరవాత మంచు లక్ష్మి సదరు జర్నలిస్టుపై మండి పడుతూ.. ఓ లేఖ రాశారు. క్షమాపణలు కోరారు. ‘మా’ కూడా వెంటనే అలెర్ట్ అయ్యింది. ఈ వ్యవహారం పై జర్నలిస్టుని వివరణ అడగడం, ఆయన ఇవ్వడం జరిగిపోయాయి. సోమవారం జర్నలిస్టు సంఘాలు సమావేశం అవ్వబోతున్నాయి. ఇదే విషయంపై మూర్తిని వివరణ కోరనున్నాయి. ఇంత తతంగం గడిచాక ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే – ఆ ప్రశ్న కాస్త షార్ప్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ సమాధానం మాత్రం అలానే ఉంది. మంచు లక్ష్మి తిరుగుబాటుతో ఆ ఇంటర్వ్యూ మొత్తం సోషల్ మీడియా నుంచి లేపేసినా.. సదరు ప్రశ్న – సమాధానం సోషల్ మీడియాలో బిట్లు బిట్లుగా వైరల్ అవుతూనే ఉంది.
ఏదో ఓ వివాదాస్పద ప్రశ్న ఉంటేనే గానీ, సదరు ఇంటర్వ్యూ పాపులర్ కాదన్న దురభిప్రాయం పాత్రికేయుల్లో కనిపిస్తోంది. అందుకే గుచ్చి.. గుచ్చి అడిగే ప్రశ్నలు ఎక్కువవుతున్నాయి. ఓ ప్రశ్నే అటు తిప్పి, ఇటుతిప్పి కార్నర్ చేయడం, తమకు సరిపడా సమాధానం వచ్చే వరకూ గెస్ట్ ని ఇబ్బంది పెట్టడం ఓ వ్యసనంలా మారుతోంది. తరచూ ఇలాంటి వ్యవహారాలే జరుగుతుంటే, కాంట్రవర్సీలే ధ్యేయం, మసాలా ప్రశ్నలే లక్ష్యం అనుకొని సినీ పాత్రికేయం పరుగులు పెడుతుంటే… ఎప్పుడో ఒకప్పుడు ఇంటర్వ్యూలంటేనే పూర్తిగా వెగటు పుట్టే ప్రమాదం ఉంది. ‘మాకు అసలు ఇలాంటి ఇంటర్వ్యూలే వద్దు’ అని దండం పెట్టి సెలబ్రెటీలంతా పారిపోక ముందే… సినీ పాత్రికేయం కాస్త సంస్కారవంతమైన ప్రశ్నల్ని అలవాటు చేసుకొంటే మంచిది.
