రియో ఒలింపిక్స్ వెండి పతకం సాధించిన పీవీ సింధుకి నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో సన్మానించి, బహుమతి ప్రధానం చేయబోతున్నారు. ఆమెకి ఘనస్వాగతం చెప్పడానికి తెలంగాణా సర్కార్ ముంబాయి నుంచి ప్రత్యేకంగా ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సుని రప్పిస్తే, ఏపి సర్కార్ ఆమెని హైదరాబాద్ నుంచి విజయవాడకి ప్రత్యేక విమానంలో తీసుకువస్తోంది. విజయవాడ తెదేపా ఎంపి కేశినేని నాని ఆమెని హైదరాబాద్ నుంచి తోడ్కొని వస్తారు.
ఆమె, కోచ్ గోపీ చంద్ ఉదయం 8.30కి గన్నవరం విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంకి ఊరేగింపుగా తీసుకు వెళతారు. అక్కడ వారిరువురికీ సన్మాన కార్యక్రమాలు అయిన తరువాత మళ్ళీ సాయంత్రం కృష్ణా పుష్కరాల ముగింపు సందర్భంగా హారతి కార్యక్రమంలో అదే వేదికపై వారిని ముఖ్యమంత్రి సన్మానం చేస్తారు.
ఈవిధంగా సిందూని, ఆమె కోచ్ గోపీ చంద్ ని రెండు తెలుగు రాష్ట్రాలు ఘనంగా సన్మానించడం చాలా హర్షణీయం. తద్వారా ఆమె ఇరురాష్ట్రాలకి చెందిన వ్యక్తి అనే భావన ప్రజలకి కూడా కలుగుతుంది. దేశంలో ఇంకా చాలా రాష్ట్రాలు కూడా ఆమెకి సన్మానం చేయాలనుకొంటున్నాయి కనుక గోపీ చంద్ చెప్పినట్లుగా సింధూ యావత్ భారత్ కి చెందిన వ్యక్తి అని చాటి చెప్పినట్లు అవుతుంది.
సింధూ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని సంకుచితంగా ఆలోచిస్తున్న వారు వెళ్ళక ముందు కనీసం ఆమె గురించి ఎన్నడైనా ఆలోచించామా? ఒలింపిక్స్ లో పతకం సాధించడానికి తాము ఆమెకి ఎప్పుడైన సహాయపడ్డమా? ఎన్నడైనా సహకరించామా? అని తమని తాము ప్రశ్నించుకొంటే మంచిది. ఆమెకి ఘన సన్మానాలు చేయడం కోసం ప్రభుత్వాలు పోటీలు పడటంకంటే, ఆమె స్పూర్తితో క్రీడల అభివృద్ధి కోసం ఏమైనా చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. సింధు కూడా అదే విషయాన్ని తనని ఘనంగా సన్మానిస్తున్న ప్రభుత్వాలకి ప్రజల సమక్షంలోనే చెపితే కనీసం ఆమె మాటని కాదనలేకైనా ప్రభుత్వాలు ఏదో ఒకటి చేస్తాయి. అప్పుడు దేశంలో క్రీడారంగానికి మేలు జరుగుతుంది. కొత్త క్రీడాకారులు తయారవుతారు
