కాశ్మీర్ లో గత 45రోజులుగా సాగుతున్న అల్లర్లలో 62 మంది చనిపోయారు. సాధారణంగా ఇటువంటప్పుడు ఆ తప్పుని ఎదుటివాళ్ళమీదకి నెట్టేసే ప్రయత్నం అందరూ చేస్తుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది.
మొన్న ఆదివారం జమ్మూలో భాజపా నేతృత్వంలో జమ్మూలో ఇస్మాయిల్ పూర్ నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ పోలీసులపై రాళ్ళు రువుతున్నవారు సత్యాగ్రాహిలు కారని వారు ఖచ్చితంగా వేర్పాటువాదులేనని అన్నారు.
జైట్లీ మాటలపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. “కాశ్మీర్ ప్రజలు రాళ్ళు రువ్వేవారు కాదు. వారు శాంతి కామకులు. అందరూ శాంతినే కోరుకొంటున్నారు. తుపాకులు, రాళ్ళతో ఈ సమస్య పరిష్కారం కాదు. భద్రతాదళాల చేతిలో మా పిల్లలు ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. కాశ్మీర్ లో నెలకొన్న ఈ పరిస్థితులు కారణంగా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. కనుక ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం సంబంధిత వర్గాల ప్రజలతో చర్చలకి సిద్దపడితే మంచిది. ప్రజలతో మాట్లాడేందుకు ఇదే సరైన సమయం,” అని అన్నారు.
కేంద్రప్రభుత్వం దీనిని శాంతిభద్రతల సమస్యగా చూస్తునందునే సమస్య ఇంకా జటిలం అవుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కనుక భద్రతాదళాలు పెల్లెట్ గన్స్ వాడకుండా నిషేదించాలని ప్రధాని నరేంద్ర మోడీని ప్రతిపక్షాలు కోరాయి. రాష్ట్రంలో కేవలం అభివృద్ధిపనులు చేపట్టినంత మాత్రాన్న ఈ సమస్య పరిష్కారం కాదని, ప్రజలతో మాట్లాడవలసిన అవసరం ఉందని ప్రధాని మోడీ కూడా అంగీకరించారని, కనుక తక్షణమే ఆపని చేయాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
కాశ్మీర్ లో సమస్య ఏర్పడినప్పుడు దానిని పరిష్కరించవలసిన బాధ్యత మొదట రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. సమస్య మొదలైనప్పుడు దానిని సకాలంలో గుర్తించి పరిష్కరించే ప్రయత్నం చేయకుండా చనిపోయిన ఉగ్రవాది బుర్హాన్ వనీకి, వేర్పాటువాదులకి మద్దతుగా ముఖ్యమంత్రి మాట్లాడటంతో అల్లరి మూకలకి తాము చేస్తున్న పని సరైనదేననే భావన కల్పించినట్లయింది. పరిస్థితి చెయ్యి దాటిపోయాక ఇప్పుడు ఆమె కూడా కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.
ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ఎప్పుడూ వేర్పటువాదులకి అనుకూలంగానే వ్యవహరిస్తుంటాయి తప్ప జమ్మూ కాశ్మీర్ ప్రజలని భారత్ తో మమేకం చేసే ప్రయత్నాలు చేయవు. అంటే ఈ సమస్యని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలే పెంచి పోషించాయని అర్ధం అవుతోంది. ఇప్పుడు అవి కూడా కేంద్రప్రభుతాన్నే నిందిస్తున్నాయి.
ఆ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నందున దానిని కాపాడుకోవడం కోసమే కేంద్రప్రభుత్వం కాశ్మీర్ సమస్యని ఇంతకాలం ఉపేక్షించి తప్పు చేసింది. ఇక కాశ్మీర్ అల్లర్లని తామే ప్రేరేపిస్తున్నామని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా చెప్పుకొన్నారు. ఈవిధంగా అందరూ కలిసి చేసిన తప్పుల కారణంగా కాశ్మీర్ ఇప్పుడు రావణ కాష్టంగా మారిపోయింది. కనుక ఇప్పుడు అందరూ ఒకరినొకరు విమర్శించుకొంటూ కాలక్షేపం చేయడం కంటే ఈ సమస్యని ఏవిధంగా పరిష్కరించాలో ఆలోచిస్తే మంచిది.
