రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. శాఖల వారీగా మంత్రులు మిగిలిన పనులను సమర్థంగా చేయడం వారి బాధ్యత. అయితే ప్రభుత్వ పరంగా జరుగుతున్న నిర్లక్ష్యం శాపంగా మారి, ప్రమాదాల్లో అమాయకులు బలికావడం కొనసాగుతూనే ఉంది. ఒప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్నీ ఆంధ్రా పాలకుల పెత్తనాన్ని ఆడిపోసుకున్నారు. తెలంగాణ, తెరాస ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఇంకా పాత ప్రభుత్వాలనే తిడుతూ కూర్చుంటారా?
ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాన్ని మరోసారి కళ్లకు కట్టింది. మేం వచ్చి రెండేళ్లే అయిందని దబాయించడానికి లేదు. అది ప్రమాదకరమైన మలుపు అని అందరికీ తెలుసు. రోడ్లు భవనాల శాఖ ఏం చేస్తున్నట్టు? అదే జిల్లాకు చెందిన ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈ ప్రమాదాలను ఎందుకు సీరియస్ గా తీసుకోరు? అక్కడ గతంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయో ఎంత మంది బలయ్యారో ఆయనకు వివరంగానే తెలుసు.
ఆర్ అండ్ బి నాకిష్టమైన శాఖ అని చెప్పుకోవడం కాదు. ప్రజల ప్రాణాలు పోకుండా జాగ్రత పడటం, రహదారులను అవసరమైన విస్తరించడం ముఖ్యం. ఇష్టం అనేది వ్యక్తిగతం. ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వాటి గురించి ఆలోచించాలి.
నాయకన్ గూడెం రోడ్డు ప్రమాదకరమైన మలుపు. ఆ ప్రాంతంలోనే ఓ వంతెన ఉంది. దాని రెయిలింగ్ కూలిపోయినా రోడ్లు భవనాల శాఖ మంత్రికి గానీ అధికారులకు గానీ కనిపించడం లేదు. ఇప్పుడున్న వంతెనకు సమాంతరంగా మరో వంతెన నిర్మిస్తే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది. రెండు వంతెనలుంటే వన్ వే లుగా ఉపయోగించవచ్చు. అప్పుడు ప్రమాదాలు జరిగే రిస్క్ తగ్గుతుందంటున్నారు నిపుణులు.
రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదకరమైన రోడ్లు, మలుపులు ఇంకా ఉన్నాయి. వాటన్నింటి విషయంలో ఓ విధాన నిర్ణయం తీసుకుని అవసరమైన పనులు చేపడితే ముందు భద్రమైన తెలంగాణకు భరోసా ఉంటుంది.
