గేటెడ్ కమ్యూనిటీలలో నివసించే మధ్యతరగతి , ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు ప్రస్తుతం మెయింటెనెన్స్ ఖర్చులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాధారణంగా సౌకర్యవంతమైన జీవనం కోసం ఈ కమ్యూనిటీలను ఎంచుకునే నివాసితులకు, ఇప్పుడు నిర్వహణ రుసుముతో పాటు జిఎస్టి రూపంలో అదనపు భారం పడుతోంది.
హైదరాబాద్‌లోని కోకపేట్, గచ్చిబౌలి, తెల్లాపూర్ వంటి ఐటీ కారిడార్లలోని గేటెడ్ కమ్యూనిటీలలో నెలవారీ మెయింటెనెన్స్ ఛార్జీలు గత ఏడాదితో పోలిస్తే 20 నుండి 30 శాతం వరకు పెరిగాయి. సెక్యూరిటీ సిబ్బంది జీతాలు పెరగడం, క్లబ్‌హౌస్ నిర్వహణ ఖర్చులు, నిత్యావసర సేవలకు అయ్యే వ్యయం భారమవడంతో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలను పెంచుతున్నాయి. గతంలో నెలకు 6,000 నుండి 7,000 మధ్య ఉన్న ఈ రుసుము, ప్రస్తుతం చాలా చోట్ల 8,000 దాటి 10,000 కు చేరుకుంది.
నిర్వహణ ఛార్జీల పెరుగుదల వల్ల సామాన్యులకు ఎదురవుతున్న అతిపెద్ద సమస్య జిఎస్టి . నిబంధనల ప్రకారం, ఒక ఫ్లాట్‌కు నెలవారీ మెయింటెనెన్స్ 7,500 దాటితే, మొత్తం మొత్తంపై 18 శాతం జిఎస్టి వర్తిస్తుంది. మెయిన్టనెన్స్ 7,600 అయితే దానిపై అదనంగా 1,368 జిఎస్టి పడుతుంది. దీనివల్ల నివాసితులు ఒక్కసారిగా నెలకు 2,000 నుండి 3,000 వరకు అదనపు భారాన్ని భరించాల్సి వస్తోంది. నివేదికల ప్రకారం, హైదరాబాద్‌లోని సుమారు 200లకు పైగా గేటెడ్ కమ్యూనిటీలలోని 5 లక్షల కుటుంబాలపై ఈ ప్రభావం పడుతోంది. ఇప్పటికే 2 లక్షల కుటుంబాలు జిఎస్టి నెట్లోకి వెళ్లగా, తాజా పెరుగుదల వల్ల మరో 50,000 కుటుంబాలు ఈ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
అందుకే గేటెడ్ కమ్యూనిటీల్లో ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా.. కొనుగోలు చేయాలన్నా.. ఒకటికి రెండు సార్లు లెక్కలేసుకోవాల్సిందే.
